ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన హిజ్బుల్లా టాప్ కమాండర్ ఫౌద్ షోకోర్ మృతదేహం బీరూట్ శివారు ప్రాంతం దాహీలోని శిథిలాల కింద లభ్యమైంది. హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లాను లక్ష్యంగా చేసుకుని బుధవారం సాయంత్రం ఇజ్రాయెల్ డ్రోన్ ఒకటి హిజ్బుల్లా షురా కౌన్సిన్‌పై మూడు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో షోకోర్ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా దాదాపు 74 మంది గాయపడ్డారు.
తాజా ఘటనతో ఇజ్రాయెల్-ఇరాన్, ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు, ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన హిజ్బుల్లా మిలటరీ చీఫ్ ఫౌద్ షోకోర్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గతేడాది అక్టోబరు 8న ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెలీలను ఊచకోత కోశారు. వందలాదిమందిని అపహరించి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.