జైలు ప్రహరీ గోడకు అవతల తెగిపడిన తలలు.. యుద్ధక్షేత్రాన్ని తలపించేలా ఘర్షణకు దిగిన ఖైదీలు..

మంగళవారం, 3 జనవరి 2017 (08:56 IST)
బ్రెజిల్ జైలులో తలలు తెగిపడ్డాయ్. ఖైదీల మధ్య ఏర్పడిన ఘర్షణ.. యుద్ధక్షేత్రాన్ని తలపించింది. బ్రెజిల్ జైలులో డ్రగ్స్ గ్రూపులు భగ్గుమనడంతో.. దాడులు జరిగాయి. అమాజాన్‌ రాష్ట్ర రాజధాని మనావ్స్‌లోని జైలులో జరిగిన ఘర్షణల్లో కనీసం 80 మంది మరణించినట్లు జైలు అధికారులు చెప్పారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకూ జైలు ప్రాంగణం యుద్ధక్షేత్రంలా దర్శనమిచ్చింది.
 
బ్రెజిల్‌లో డ్రగ్స్‌ గ్యాంగుల మధ్య ఆధిపత్య పోరు ఉంది. సావో పాలోకు చెందిన ఫస్ట్‌ కేపిటల్‌ కమాండ్‌(పీసీసీ)... అత్యంత శక్తిమంతమైన గ్యాంగ్‌. రియో డీ జెనీరోకు చెందిన రెడ్‌ కమాండ్‌(సీవీ) డ్రగ్స్‌ గ్యాంగ్‌... రెండో శక్తిమంతమైన గ్యాంగ్‌. వీటి మధ్య కుదిరిన సంధి... గతేడాది చెడింది. దీంతో ఘర్షణలు మొదలయ్యాయి. కాగా, జైల్లోని ఖైదీల సంఖ్యకు సరిపడినంత నీటి సరఫరా లేకపోవడంవల్లే ఈ ఘర్షణ ప్రారంభమైందని వార్తలు వస్తున్నాయి. పారిపోవాలన్న ఉద్దేశంతోనే విజిటింగ్‌ సమయం నుంచే జైలు ఆవరణలోని పరిస్థితిని ఉద్రిక్తం చేయడానికి ప్రయత్నించినట్లు కూడా మీడియా పేర్కొంది.
 
ఖైదీలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పాటు తలలను నరికి జైలు ప్రహరీ గోడకు అవతల పడేసినట్లు ఓ వార్తా పత్రిక పేర్కొంది. డజన్లకొద్దీ మృతదేహాలు గుట్టలుగా జైలు లోపలే పడి ఉన్నట్లు స్థానిక వార్తా చానల్‌ తెలిపింది. ఈ జైలు చుట్టూ అడవి ఉండడంతో ఎక్కువ మంది ఖైదీలు పారిపోయే అవకాశముండదని చెప్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి