అగ్రరాజ్యం అమెరికాలోని క్యాపిటల్ భవనంపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులే కావడం గమనార్హం. వాషింగ్టన్‌లోన క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. దీంతో వీరిని అదుపు చేసేందుకు అమెరికా భద్రతా బలగాలు కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కాల్పుల్లో నలుగురు మరణించినట్టు సమాచారం.
ఇదిలావుండగా, సుమారు 207 ఏళ్ల తర్వాత కాపిటల్ హిల్‌పై ఇలా నేరుగా దాడి జరగడం ఇదే తొలిసారి. గత యేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ చిత్తుగా ఓడిపోయారు. కానీ, ఈ ఓటమిని ఆయన అంగీకరించడం లేదు. పైపెచ్చు.. తన మద్దతుదారులను రెచ్చగొడుతున్నారు. ఫలితంగా క్యాపిటల్ హిల్‌పై ట్రంప్ మద్దతుదారుల దాడికి పాల్పడ్డారు. ఈ దాడితో ప్రపంచం నివ్వెరపోయింది. ఏకంగా చట్ట సభలనే లక్ష్యంగా చేసుకోవడం, అదీ ప్రస్తుతం అధ్యక్ష పీఠంపై ఉన్న వ్యక్తికి మద్దతిచ్చే వాళ్లే ఈ దుశ్చర్యకు పాల్పడటం దేశాధినేతలను కూడా విస్తుపోయేలా చేసింది.
నిజానికి 1812లో జరిగిన యుద్ధంలో భాగంగా తొలిసారి దాడి జరిగింది. 1814లో బ్రిటీష్ సేనలు అప్పటికీ నిర్మాణంలో ఉన్న క్యాపిటల్‌పై దాడి చేశారు. వైస్ అడ్మిరల్ సర్ అలెగ్జాండర్ కాక్‌బర్న్, మేజర్ జనరల్ రాబర్డ్ రాస్ నేతృత్వంలోని బ్రిటీష్ సేనలు కాపిటల్ హిల్‌కు నిప్పు పెట్టారు. అయితే ఆ వెంటనే భారీ వర్షం కురవడంతో నిర్మాణానికి నష్టం వాటిల్లలేదు.
సుమారు 207 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్థాయి దాడి జరగడంపై కాపిటల్ హిస్టారికల్ సొసైటీ ఆవేదన వ్యక్తం చేసింది. యూఎస్ కాపిటల్ అనేది కేవలం ఒక భవనం కాదని, అది అమెరికన్ ప్రజాస్వామ్య ఆత్మ అని హిస్టారికల్ సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది.