భీమవరం బుల్లోడు బ్రిటన్ ఉప మేయర్ అయ్యాడు.. ఎలా?

ఠాగూర్

శుక్రవారం, 23 మే 2025 (14:17 IST)
వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన ఆర్యన్ ఉదయ్ ఆరేటి బ్రిటన్‌కు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యాడు. భీమవరం మండలం, తుందుర్రుకు చెంది ఆర్యన్... యూకేలోని రాయల్ బరో కెన్సింగ్టన్‌, చెల్సియా డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేసినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. భీమవరం యుకుడు యూకేలో ఉన్నత పదవి చేపట్టడంపై అతని బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇందుర్రు గ్రామానికి చెందిన ఆరేటి వీరాస్వామి, గొబ్బెళ్లమ్మ మనవడు ఉదయ్. ఈయన తండ్రి వెంకటసత్యనారాయణ భీమవరంలోని ఓ ప్రముఖ విద్యాసంస్థలో హెచ్ఎంగా పని చేశారు. ఉదయ్ సెయింట్మెరీ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు. టెన్నిస్‌పై ఆసక్తితో హైదరాబాద్ వెళ్లి అక్కడే ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం చేశారు. ఆపై భీమవరంలో డిగ్రీ, నరసాపురంలో ఎంబీఏ విద్యాభ్యాసం పూర్తి చేశారు. లండన్‌లో ఎంఎస్ పూర్తి చేసి, యునైటెడ్ కింగ్డమ్ తెలుగు సంఘం కార్యదర్శిగా పని చేశారు.
 
రాజకీయాలపై ఆసక్తి పెంచుకొని కన్సర్వేటివ్ పార్టీలో చురుగ్గా వ్యవహరించారు. 2018, 2022లో వరుసగా రెండుసార్లు ఆ పార్టీ తరపున కౌన్సిలర్‌‌గా ఎన్నికయ్యారు. రాయల్ బరో కెన్సింగ్టన్, చెల్సియా కౌన్సిలర్‌గా పని చేస్తూ.. ప్రస్తుతం ఉప మేయర్‌గా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పదవిలో 2026 వరకు కొనసాగనున్నారు. 
 
ప్రస్తుతం బ్రిటన్‌లో కన్సర్వేటివ్ పార్టీ ఇండియా విభాగానికి ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా, యూరోప్ ఇండియా సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీకి ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. గత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు నమ్మకస్థుడిగా ఉన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, సినీ కథానాయకుడు చిరంజీవిని లండన్‌లో కలిశారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు