రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ట్రంప్.. అధికారికంగా నామినేషన్ స్వీకరణ!!

శుక్రవారం, 28 ఆగస్టు 2020 (12:18 IST)
శ్వేతసౌథం అధ్యక్ష రేసులో ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందుకోసం రిపబ్లికన్ పార్టీ తరపున అధికారిక అభ్యర్థిగా ఆయన నామినేషన్ స్వీకరించారు. రిబప్లికన్ పార్టీ తరపున వైట్‌హౌస్ సౌత్‌లాన్ నుంచి అధ్యక్ష పదవికి ఆయన నామినేట్ అయ్యారు. 
 
ఈ సందర్భంగా శ్వేతసౌథంలో నిర్వహించిన వర్చువల్ కన్వెన్షన్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడిగా ఈ నామినేషన్‌ను గర్వంగా అంగీకరిస్తున్నట్టు తెలిపారు. అపూర్వమైన మద్దతుతో, గౌరవంతో ప్రజల ముందు మరోమారు నిలబడినట్టు అభిప్రాయపడ్డారు. 
 
అమెరికా ఎన్నికల చరిత్రలో ఇవి చాలా ముఖ్యమైన ఎన్నికలని అభివర్ణించారు. అన్ని భయాలు, ప్రమాదాల నుంచి అమెరికన్లను రక్షించినట్టు చెప్పారు. కొత్త శిఖరాలను అధిరోహించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 74 ఏళ్ల ట్రంప్ తన ప్రత్యర్థి జో బైడెన్ ‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
జో బైడెన్ అమెరికన్ల ఉద్యోగాలను నాశనం చేసే వ్యక్తని ఆరోపించారు. నల్లజాతీయుల కోసం బైడెన్ గత 47 ఏళ్లలో చేసినదానికంటే ఈ మూడేళ్లలో తాను చేసిందే ఎక్కువన్నారు. ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో కలిసి ట్రంప్ ఈ కార్యక్రమంలో పాల్గొనగా, తొలుత ట్రంప్‌ను ఆయన కుమార్తె ఇవాంకా పరిచయం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు