ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికాలోకి ప్రవేశించకుండా ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు ఆపేస్తారు. సిరియా వలసదారుల్లో క్రిస్టియన్లకు ప్రాధాన్యమివ్వనున్నారు. అమెరికాకు మద్దతిచ్చే వారు, అమెరికన్లపై అభిమానం ఉన్న వారే ఇక్కడి రావాలని కోరుకుంటున్నామని ట్రంప్ పేర్కోన్నారు.
'ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికా బయటే ఉంచేందుకు అత్యంత క్లిష్టమైన నిబంధనలు తీసుకువస్తున్నా. ఉగ్రవాదులు ఇక్కడ ఉండాలని మేము అనుకోవట్లేదు' అని ట్రంప్ ఆర్డర్‌పై సంతకం చేసిన అనంతరం తెలిపారు. అయితే ట్రంప్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయడాన్ని హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనదని హెచ్చరిస్తున్నారు. ఈ ఆర్డర్ ప్రకారం వలసదారులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించే వరకు ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమెన్ దేశాలకు చెందిన పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తారు.