అట్లాంటింక్ మహాసముద్రంలో 111 యేళ్ల క్రితం మునిగిపోయి 12 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ షిప్ శకలాలను చూసేందుకు వెళ్ళి గల్లంతైన మినీ జలాంతర్గామి (మినీ సబ్ మెరైన్) కథ ముగిసింది. టైటానికి కోసం చేసిన అన్వేషణ ఫలించలేదు. దీంతో ఆ సబ్ మెరైన్‌లోని ఐదుగురు బిలియనీర్లు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర పీడనం కారణంగా అది సముద్ర గర్భంలో పేలిపోయిందని అమెరికన్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసినట్టు రియర్ అడ్మిరల్ జాన్ మౌగర్ తెలిపారు.
టైటాన్‌లోని టైటానికి శకలాలు చూసేందుకు వెళ్లిన ఐదుగురు చనిపోయివుండొచ్చని అంతకుముందు ఈ యాత్రను చేపట్టిన ఓషన్‌గేట్ తెలిపింది. ఆ ఐదుగురు నిజమైన అన్వేషకులని, ప్రపంచ మహాసముద్రాల అన్వేషణ, రక్షణలో వీరు ఎంతో అభిరుచి కలిగి ఉన్నారని పేర్కొంది. ఈ విషాద సమయంలో తమ ఆలోచనలు వారి కుటుంబాలతోనే ఉన్నాయని, ఈ ఘటనకు చింతిస్తున్నట్టు వెల్లడించింది.
కాగా, ఈ మినీ సబ్‌మెరైన్‌లో చనిపోయిన వారిలో పాకిస్థాన్ బిలియనీర్ షెహజాదా దావూద్ (48), ఈయన కుమారుడు సులేమాన్ (19), యూఏఈలో ఉండే బ్రిటీష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ మాజీ నావికాదళ అధికారి పాల్ హెన్రీ, యాత్ర నిర్వాహకడు, ఓషన్‌గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్‌లు ఉన్నారు.
ఈ మినీ జలాంతర్గామి సముద్రంలోకి వెళ్లిన కొద్ది సమయానికే మదర్ షిప్‌తో సంబంధాలు తెగిపోయి, సముద్రంలో గల్లంతైంది. అప్పటి నుంచి దానికోసం అన్వేషణ సాగించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తీవ్ర పీడనం కారణంగా సముద్ర గర్భంలో అది పేలిపోవడంతో అందులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.