హాంకాంగ్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు సోమవారం తెల్లవారుజామున జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒక కార్గో విమానం రన్ వేపై నుంచి జారిపడి సముద్రంలో పడిపోయింది. ఈ ఘటనలో విమానాశ్రయ గ్రౌండ్ సిబ్బంది ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, విమానంలో ఉన్న మరో నలుగురు సిబ్బంది తేలికపాటి గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
ఆ సమయంలో రన్ వేపై పనిచేస్తున్న ఇద్దరు గ్రౌండ్ సిబ్బంది సముద్రంలో పడిపోయారు. వారిని వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ వారు మరణించారు. విమాన సిబ్బందిలో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదం జరిగిన రన్ వేను తాత్కాలికంగా మూసివేయగా, మిగతా రెండు రన్ వేల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం రక్షణ చర్యల కోసం హెలికాప్టర్లు, అగ్నిమాపక నౌకలను ఘటనాస్థలికి పంపింది.
ఈ ప్రమాదం తర్వాత కనీసం 11 కార్గో విమానాల సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతా పరంగా అత్యుత్తమ రికార్డు కలిగిన హాంకాంగ్ విమానాశ్రయంలో ఇలాంటి ప్రమాదాలు చాలా అరుదుగా చోటుచేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. కాగా, ఎమిరేట్స్ సంస్థ ఇప్పటివరకు ఈ ఘటనపై అధికారిక ప్రకటన చేయలేదు.