ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు వాడుతున్నట్టు ట్రంప్ ప్రపంచ ప్రకటించి ఓ పెద్ద చర్చకు తెరలేపారు. ఇప్పుడు ఆ మాత్రలు వాడటం మానేసినట్టు చెప్పారు. రెండు వారాలపాటు ఈ మాత్రలు వాడానని, ఇప్పుడు తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపారు. ఆ మాత్రలను ఎందుకు వాడానో ఆ లక్ష్యం నెరవేరిందన్నారు.
నిజానికి కరోనా వైరస్ సోకిన రోగికి హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలు వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వైద్యులు తేల్చి చెప్పారు. పైగా, ఈ మాత్రలు వాడటం వల్ల అనేక దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. కానీ, ట్రంప్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఈ మాత్రలను రెండు వారాల పాటు తీసుకున్నారు.
ఇకపోతే, అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోందని చెప్పారు. కొత్త కేసుల నమోదుతో పాటు.. మరణించే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతుందని ట్రంప్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య 50 శాతానికి తగ్గినట్టు కరోనా నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్న వైట్‌హౌస్ అధికారి డెబొరా బిరెక్స్ ఇటీవల తెలిపారు.
ఇప్పుడు ట్రంప్ స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రజలకు కొంత ఊరట లభించినట్టయింది. కాగా, అమెరికాలో ఇప్పటివరకు 16,77,356 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 98,024 మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 3,41,718 మంది కోలుకోగా, ఇంకా 12,37,614 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.