డోక్లామ్ నుంచి భారత్ దళాల ఉపసంహరణ.. ప్రతిష్టంభనకు తెరపడింది..

మంగళవారం, 29 ఆగస్టు 2017 (12:13 IST)
భారత్-చైనాల మధ్య ఏర్పడిన డోక్లామ్ సమస్య తొలగిపోయింది. డోక్లామ్ నుంచి భారత్ తన దళాలను ఉపసంహరించుకునేందుకు అంగీకరించడంతో పాటు ఉపసంహరణ ప్రారంభించడంతో కొన్ని నెలల పాటు రెండు దేశాల మధ్య ఏర్పడిన సరిహద్దు ప్రతిష్టంభనకు తెరపడింది.

ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది రోజుల్లో బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొనడానికి చైనా పర్యటనకు వెళుతున్న సందర్భంలో భారత్‌ తన దళాలను ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. డోక్లామ్ వద్ద భారత్- చైనాలు కొద్ది వారాల పాటు దౌత్యపరమైన చర్చలు జరిపాయి. 
 
ఈ చర్చల ప్రాతిపదికన డోక్లామ్‌లోని ప్రతిష్టంభన ప్రాంతం నుండి సరిహద్దు దళాలను వెంటనే ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. దీన్ని చైనా కూడా ధ్రువీకరించింది.

సిక్కిం సెక్టార్‌లోని తమ భూభాగంపై సార్వభౌమాధికారానికి చిహ్నంగా చైనా దళాలు డోక్లాంలో గస్తీ కాస్తుంటాయని చైనా రాజధాని నుండి వచ్చిన మరో వార్త తెలియజేసింది. 
 
డోక్లామ్‌ పీఠభూమిలో చైనా-భూటాన్‌ల మధ్య వివాదంలో ఉన్న ప్రాంతంలో చైనా రోడ్డు మార్గం నిర్మిస్తుండడంతో గత జూన్‌లో భారత్‌ సరిహద్దు దళాలు ఆ ప్రాంతంలోకి ప్రవేశించడంతో ఇరు దేశాల మధ్య సైనిక ప్రతిష్టంభన ఏర్పడింది.

ఈ నేపథ్యంలో డోక్లామ్‌ నుండి భారత దళాలు ఉపసంహరించుకుంటున్నట్లు భారత విదేశాంగ శాఖ చేసిన ప్రకటనను దేశ రక్షణ వర్గాలు కూడా నిర్ధారించాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు