మోసుల్ 'డెడ్లీ డేంజర్'... మోసుల్ కింద రహస్యంగా మరో నగరం...

ఆదివారం, 6 నవంబరు 2016 (10:29 IST)
ఇరాక్‌లోని మోసుల్ నగరాన్ని అమెరికా, ఇరాక్ సేనల సారథ్యంలోని ప్రత్యేక బలగాలు తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఈ నగరంపై పట్టు సాధించిన ఇరాకీ సేనలకు... ఎన్నో నిజాలు తెలుస్తున్నాయి. 
 
నిజానికి ఈ నగరం... మంచి రహదార్లు, ఎత్తయిన భవనాలు, వందల కోట్లలో వ్యాపారం జరిగే మోసుల్ నగరం, ఇప్పుడు శిథిలమైపోయి గత చరిత్రకు సాక్ష్యంగా కనిపిస్తోంది. దీనికి కారణం గత 2014 నుంచి ఐఎస్ కబందహస్తాల్లో చిక్కకుని ఇపుడిపుడే సైన్యం వశవుతోంది.
 
అయితే, ఇస్లామిక్ ఉగ్రవాదులు తమ రక్షణ కోసం నగరం కింద మరో నగరాన్నే నిర్మించుకోవడం భద్రతాదళాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పెద్దపెద్ద బంకర్లలో భారీ ఎత్తున మందు పాతరలు ఉండటం, బంకర్లు ఎక్కడ ఉన్నాయన్న విషయమై సరైన సమాచారం లేకపోవడంతో మరిన్ని రోజుల పాటు మోసుల్ 'డెడ్లీ డేంజర్' అంటున్నారు నిపుణులు. 
 
మోసుల్ నగరాన్ని వశం చేసుకున్న తర్వాత ఇప్పటివరకూ ఆరు భారీ టన్నెల్స్ కనిపించాయి. గత మూడు రోజులుగా టన్నెల్స్ గుర్తించడమే సైన్యానికి ప్రధాన కర్తవ్యమైంది. గుర్తించిన టన్నెల్స్‌లో సకల సౌకర్యాలూ ఉన్నట్టు తెలుస్తోంది. గత వారాంతంలో సైన్యానికి, టన్నెల్స్‌లో దాగుండి విరుచుకుపడిన ఉగ్రవాదులకూ మధ్య తీవ్ర యుద్ధం జరిగిందని బ్రిగేడియర్ జనరల్ యహ్యా రసూల్ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి