చైనాలో కమ్యూనిస్టు పార్టీలో చేరాలని వుంది.. జాకీచాన్ మనసులోని మాట

మంగళవారం, 13 జులై 2021 (22:30 IST)
ప్రముఖ హలీవుడ్ నటుడు జాకీచాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనెంత పాపులరో అందరికీ తెలిసిందే. తాజాగా జాకీచాన్ రాజకీయాల్లోకి రానున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సినిమాల్లో తన మార్షల్ ఆర్ట్స్ ద్వారా అదరగొట్టే జాకీ చాన్ ఇకపై రాజకీయాల్లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
 
తనదైన యాక్షన్‌తో మార్షల్‌ ఆర్ట్స్‌ను ప్రపంచానికి పరియం చేశారు జాకీచాన్‌. కేవలం చైనాలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో జాకీచాన్‌ అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న జాకీ చాన్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో జాకీ చాన్‌ తాజాగా తన మనసులో మాటను బయటపెట్టారు. తనకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనాలో (సీపీసీ) చేరాలని ఉందని చెప్పుకొచ్చారు. జులై 1న సీపీసీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ప్రసంగం చేశారు. 
 
ఈ ప్రసంగంపై జులై 6న దేశ సినీ ప్రముఖులు ఓ చర్చా కార్యక్రామన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైనా ఫిలిం అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న జాకీచాన్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగానే జాకీచాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. సీపీసీ గొప్పతనం కళ్లముందే కనపడుతుందన్న జాకీచాన్.. అధికార పార్టీ ఎలాంటి వాగ్ధానాలు చేస్తుందో వాటిని తప్పక నెరవేరుస్తుందన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌పై చైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు