ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కోఫి అన్నన్ (80) కన్నుమూశారు. వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యల కారణంగా ఆయన శనివారం చనిపోయారు. గత కొద్ది రోజుల కిందట స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కోఫి అన్నన్ ఫౌండేషన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
కాగా, 1938, ఏప్రిల్ 8న ఘనాలోని కుమాసిలో జన్మించిన ఆయన... ఐక్యరాజ్య సమితికి 7వ ప్రధాన కార్యదర్శి. ఆఫ్రికా ఖండంలోని ఘనాలో పుట్టిన అన్నన్ సమితికి నేతృత్వం వహించిన మొట్టమొదటి నల్లజాతి ఆఫ్రికన్ వ్యక్తి. రెండుసార్లు ఎన్నికై 1997, జనవరి 1 నుంచి పదేళ్ళపాటు ఆ పదవిలో కొనసాగినాడు. 2001లో ఇతడికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఘనాలోని కుమాసిలో జన్మించిన ఇతడు ఉన్నత విద్య అమెరికాలో అభ్యసించాడు.
1997 - 2006 మధ్య రెండు పర్యాయాలు ఐక్యరాజ్య సమితికి ఆయన సెక్రటరీ జనరల్‌గా పనిచేశారు. అంతకుముందు సమితి శాంతి పరిరక్షక దళ చీఫ్‌గా వ్యవహరించారు. 2001లో ఆయన ఐక్యరాజ్య సమితితో కలిసి సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. అయితే ఆయన హయాంలోనే ఇరాక్‌పై అమెరికా దండెత్తి ధ్వంసం చేయడంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇది సమితి వైఫల్యమేనని ఆయన 2006లో అంగీకరించారు.