అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు విధానాలపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నోరు విప్పారు. శరణార్థుల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికన్లు కొందరు నిరసన కార్యక్రమాలకు దిగారు. ఈ నిరసనలకు ఒబామా మద్దతు ప్రకటించారు. మతం, విశ్వాసాల ఆధారంగా వ్యక్తులను వివక్షకు గురిచేయడాన్ని ఎంత మాత్రం ఏకీభవించనని ఒబామా స్పష్టం చేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం తనకు కోపం తెప్పించిందని చెప్పారు.
వైట్‌హౌస్‌ను వీడిన పదిరోజుల తర్వాత ఒబామా ట్రంప్‌కు వ్యతిరేకంగా నోరు విప్పారు. ముస్లింలపై నిషేధం విషయంలో తాను కూడా ఒబామా విధానాలనే అనుసరిస్తున్నా అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇస్తూ ఒబామా కార్యాలయం ప్రకటన చేసింది. ట్రంప్ జారీచేసిన ట్రావెల్ నిషేధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు ఒబామా మద్దతు పలికారు.
కాగా.. సిరియా, ఇరాక్ సహా ఏడు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులు అమెరికాకు రాకుండా ట్రంప్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఆదేశాలను ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా.. పరోక్షంగా ఈ అంశంపై ఆయన స్పందించారు. మతం, విశ్వాసం ఆధారంగా వ్యక్తులపై వివక్ష చూపడాన్ని సైద్ధాంతికంగా ఒబామా ఏకీభవించడం లేదని, ఆయన విదేశాంగ విధాన నిర్ణయాలు కూడా ఇదే విషయాన్ని చాటుతాయని ఒబామా కార్యాలయం వెల్లడించింది.