ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశం జారీచేసిన వారం రోజుల్లోనే లక్ష వీసాలను అమెరికా రద్దు చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అటార్నీ శుక్రవారం తెలియజేశారు. ట్రంప్ ఆదేశం జారీచేయగానే డుల్లెస్ విమానాశ్రయంలో ఇద్దరు యెమెనీ సోదరులను అడ్డుకుని ఇథియోపియాకు వెనక్కి పంపిన కేసు కోర్టులో విచారణకు వచ్చినప్పుడు ఈ వివరాలను వెల్లడించారు.
ట్రంప్ బాధ్యతలు చేపట్టాక తొలి 11 రోజుల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ కాస్త మెరుగుపడినట్లు కొత్త గణాంకాలు చెబుతున్నాయి. నవంబరు, డిసెంబరు డేటాను కూడా పరిశీలిస్తే 39 వేల కొత్త ఉద్యోగాలు లభించాయని, గత మూడు నెలల్లో సగటున 1,83,000 ఉపాధి అవకాశాలను కల్పించారని తేలింది. నెలవారీ సృష్టిస్తున్న కొత్త ఉద్యోగాల సంఖ్యపై ట్రంప్ సంతృప్తి వ్యక్తంచేశారు. ముఖ్యంగా జనవరిలో 2,27,000 కొత్త ఉద్యోగాలు రావడం శుభపరిణామమన్నారు.