అమెరికాలో ఇప్పటివరకు 3,67,650 కరోనా కేసులు నమోదవగా 10,943 మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను అమెరికాకు ఎగుమతి చేసేందుకు అనుమతించాలంటూ అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీని కోరిన తెలిసిందే.
కరోనా కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసిటమాల్ మందులను ఎగుమతి చేసేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ఖండిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నేత శశిథరూర్ ట్రంప్ వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పగా తాజాగా రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పందించారు. స్నేహంలో ప్రతీకారం ఉండదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సహాయం కోరిన అన్ని దేశాలకు భారత్ చేయూత నందించాలన్నారు. ముందుగా భారత పౌరులకు అవసరమైన అత్యవసర మందులను ప్రభుత్వం తగినంత స్థాయిలో నిల్వచేసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ కంటికి కనిపించని ఓ భయంకరమైన శత్రువని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కరోనా శక్తిమంతమైంది, తెలివైంది కావచ్చు.. కానీ మేము అంతకన్నా తెలివైన వాళ్ళమన్నారు. ఇప్పటివరకు కరోనా వల్ల దేశంలోనే ఎక్కువ మరణాలు సంభవించిన న్యూయార్క్ నగరంలో ప్రస్తుతం రోజువారీ మరణాల సంఖ్య తగ్గుతోందని, ఇది మంచి పరిణామమని ట్రంప్ పేర్కొన్నారు.