థాయ్‌లాండ్‌లో సైనికుడే కాల్పులు జరిపాడు.. ఎందుకు? 26మంది మృతి

ఆదివారం, 9 ఫిబ్రవరి 2020 (12:32 IST)
థాయ్‌లాండ్‌లో దారుణం జరిగింది. ఓ సైనికుడు ఒక మాల్‌లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటన ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘటనలో 26 మంది మరణించారు.

వివరాల్లోకి వెళితే.. జక్రపంత్ తోమా అనే 32 ఏళ్ల థాయ్ సైనికుడు మొదట తన ఇంట్లో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తాను పనిచేసే ఆర్మీ క్యాంప్‌కు వెళ్లి.. అక్కడి నుంచి మరిన్ని ఆయుధాలతో ఈశాన్య థాయ్‌లాండ్‌లోని నఖోన్ రట్చసీమలోని టెర్మినల్ 21 మాల్‌కు వెళ్లాడు. అక్కడ జక్రపంత్ కనిపించిన వారందరిపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 26 మంది చనిపోగా, మరో 33 మంది గాయపడ్డారు. 
 
ఈ ఘటన శనివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. కాగా సాయుధుడైన జక్రపంత్‌ని సైనిక దళాలు కొన్ని గంటలపాటు శ్రమించి ఆదివారం తెల్లవారుజామున మట్టుబెట్టాయి. ఈ ఎదురుదాడులో ఒక సైనికుడు కూడా మరణించినట్లు థాయ్ ప్రజారోగ్య మంత్రి అనుతిన్ చార్న్‌విరాకుల్  వెల్లడించారు. ఈ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో పోలీసులు మాల్ చుట్టూ ఉన్నరోడ్లన్నీ మూసివేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
 
బ్యాంకాక్ నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న నఖోన్ రట్చసీమాకు సమీపంలో ఉన్న ఆర్మీ బేస్ వద్ద ఈ ఘటన జరిగినట్లు థాయ్ మీడియా తెలిపింది. దాడికి ముందు, జకప్రంత్ తన ఫేస్‌బుక్ ఖాతాలో తాను ప్రతీకారం తీర్చుకున్నానని పోస్ట్ చేసాడు. కానీ, అతను ఎందుకోసం అలా చేశాడో మాత్రం చెప్పలేదు. మరి సైనికుడైవుండి ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం వెనుకనున్న కారణాలేంటనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు