భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలో తప్పిపోయిన బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పరితోష్ ఆచూకీని పాకిస్తాన్ రేంజర్స్ కనుగొన్నారు. పరితోష్ గత నెల సెప్టెంబర్ 28, 2019 నుండి అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఉధృతంగా ప్రవహించే ఐక్ నల్లా ప్రాంతం నుండి కార్యాచరణ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న సమయంలో అతడు గల్లంతయ్యాడు. భారీ వర్షం పడుతున్న సమయంలో అతడు పొరబాటున కాలు జారి వాగులో పడిపోయి మునిగిపోయాడు.
దీంతో గత మూడు రోజులుగా బీఎస్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం సంయుక్త శోధన ఆపరేషన్ జరిపాయి. పాక్ రేంజర్స్, భారతీయ గ్రామస్తులు కూడా అతడి కోసం తీవ్రంగా గాలించారు. ఐక్ వాగు భారతదేశం నుండి పాకిస్తాన్ వైపుకి ప్రవహిస్తుంది. భారీగా వర్షాలు పడుతూ వుండటంతో నీటి మట్టం గణనీయంగా పెరిగింది.
ఇద్దరు తోటి సైనికుల ప్రాణాలను కాపాడుతూ తన జీవితాన్ని త్యాగం చేసిన ధైర్యవంతుడు, అంకితభావంతో పనిచేసే సైనికుడు పరితోష్ దురదృష్టవశాత్తు మృతి చెందినందుకు జమ్మూ-బీఎస్ఎఫ్ ఐజి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిరంతరాయంగా మూడురోజుల పాటు సహాయక చర్యలకు అన్ని విధాలుగా సహకరించిన ఎస్‌డిఆర్‌ఎఫ్, గ్రామస్తులు మరియు పాక్ రేంజర్లకు బిఎస్ఎఫ్ జమ్మూ కృతజ్ఞతలు తెలియజేసింది.