8 నెలల తర్వాత చైనాలో తొలి కరోనా మరణం

గురువారం, 14 జనవరి 2021 (21:37 IST)
చైనాలో దాదాపు 8 నెలల్లో తొలి కరోనా మరణం నమోదైంది. ఇటీవల కొన్ని రోజులుగా చైనాలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. దీంతో ఇప్పటికే పలు నగరాల్లో లాక్‌డౌన్‌లు, ఎమర్జెన్సీలు విధిస్తున్నారు. ఇటీవల కాలంలో హెబీ సహా మరికొన్ని ప్రావిన్సుల్లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ చైనా నిర్ణయాలు తీసుకుంది.

ఇప్పటికే గ్వాన్‌ నగరంలో లాక్‌డౌన్‌కు అధికారులు అదేశాలు జారీ చేశారు. వైరస్‌ వ్యాప్తి నివారణకు చైనా కట్టుదిట్టమైన చర్చలు తీసుకోవడంతో పాటు అంతే వేగంగా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలిగింది. అప్పటి నుంచి చాలా తక్కువ సంఖ్యలో నమోదవుతున్న కేసులు దాదాపు ఐదు నెలల తర్వాత గత సోమవారం అత్యధికంగా 103 కేసులు నిర్ధారణ అయ్యాయి. మంగళవారం నాడు 55 కేసులకు పైగా నమోదయ్యాయి.

ఆ కేసుల్లో 40 కేసులు ఒక్క హెబీ ప్రావిన్స్‌లోనే నమోదయ్యాయి. బీజింగ్‌లోని ఓ ప్రాంతంలోనూ ఒక కరోనా కేసు నమోదవ్వడంతో ఆ ప్రాంతాన్ని లాక్‌డౌన్‌లో ఉంచారు. తాజాగా, నేడు ఒక్కరోజే 138 కేసులు నమోదైనట్లు చైనా జాతీయ ఆరోగ్య మిషన్‌ వెల్లడించింది. 2020 మార్చి తరువాత ఇన్ని కేసులు నమోదవ్వడం కూడా ఇదే తొలిసారి.

తాజాగా కరోనాతో ఒకరు మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే మృతునికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఇప్పటికే లాక్‌డౌన్‌లో ఉన్న హెబి ప్రావిన్స్‌లో కరోనా మరణం సంభవించినట్లు మాత్రమే పేర్కొంది.
 
వూహాన్‌ చేరుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం..
ఇప్పటికీ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మూలాలను కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన 10 మంది నిపుణుల బృందం గురువారం చైనా చేరింది. ఈ బృందానికి పీటర్‌ బెన్‌ ఎంబారెక్‌ నేతృత్వం వహించనున్నారు. చైనా ప్రొటొకాల్స్‌ ప్రకారం వీరు మొదట అన్ని కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

అలాగే 14 రోజుల క్వారంటైన్‌ కూడా తప్పనిసరి అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అనంతరం వూహాన్‌ నగరంలో వెలుగు చూసిన వైరస్‌ మూలాలపై పరిశోధన ప్రారంభిస్తారు. కరోనా వైరస్‌ వూహాన్‌ సిటీ నుంచే పుట్టిందని ప్రపంచ దేశాలు నేటికీ గగ్గోలు పెడుతున్నాయి. అమెరికా అయితే చాలాసార్లు ఈ ఆరోపణ చేసింది. కానీ చైనా దీన్ని ఖండిస్తూ వస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు