ఘనంగా అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షుల ప్రమాణ స్వీకారం

శనివారం, 16 జనవరి 2021 (19:28 IST)
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా జో బైడెన్‌, కమలాహారీస్‌లు ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరు కానున్నారు. కాగా, ఈ కార్యక్రమాల్లో ప్రఖ్యాత కళాకారులు పాల్గనున్నారు.

ప్రముఖ గాయని లేడీ గాగా జాతీయ గీతం ఆలపించనుండగా..నటి జెన్నిఫర్‌ లోఫెజ్‌ సంగీత కచేరీ కూడా ఉండనున్నట్లు సమాచారం. అయితే కరోనా నిబంధనల నేపథ్యంలో ఇవన్నీ కూడా వర్చువల్‌ విధానంలో నిర్వహిస్తారని తెలుస్తోంది. కాగా, జో బైడెన్‌, కమలాహారీస్‌ బృందంలో భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు లభించాయి.

కరోనా కట్టడి చేసేందుకు టీకాలు అందించేందుకు సిద్ధమైన బృందంలో భారత సంతతి వ్యక్తికి చోటు కల్పించారు. కోవిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లో టెస్టింగ్‌ అడ్వైజర్‌గా హెల్త్‌ పాలసీ నిపుణుడు విదుర్‌ శర్మను బైడెన్‌ నియమించారు. సైనిక కుటుంబాల కోసం ఉద్దేశించిన 'జాయినింగ్‌ ఫోర్సెస్‌' కార్యక్రమ కార్యనిర్వాహక అధికారిగా... జో సీనియర్‌ సలహాదారు రోరీ బ్రోసియస్‌ పేరును ప్రకటించారు.

ఫెడరల్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ (ఫెమా) అడ్మినిస్ట్రేటర్‌గా న్యూయార్క్‌ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌ కమిషనర్‌ డియన్నె క్రిస్‌వెల్‌ను నామినేట్‌ చేశారు. తదుపరి ప్రథమ మహిళ డిజిటల్‌ విభాగ డైరెక్టర్‌గా భారత సంతతి అమెరికన్‌ గరిమా వర్మ, మీడియా కార్యదర్శిగా మైఖేల్‌ లారోసా పేర్లను నామినేట్‌ చేశారు.

అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌-హారిస్‌ ప్రచార కార్యక్రమాలకు గరిమా జన సమీకరణ వ్యూహాలు రచించారు. బైడెన్‌ కార్యనిర్వాహక వర్గంలో ప్రధానమైన 'నేషనల్‌ ఎకనామిక్‌ కౌన్సిల్‌' డిప్యూటీ డైరెక్టరుగా కశ్మీర్‌ మహిళ సమీరా ఫాజిల్‌ను బైడెన్‌ ఎంపిక చేశారు.దేశంలో తయారీ, ఆవిష్కరణలు వంటి అంశాలను ఆమె పర్యవేక్షిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు