ఇప్పటివరకు అనేక ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా.. ఇపుడు కరోనా వైరస్ ధాటికి ముప్పతిప్పలుపడుతోంది. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో పాటు.. ఇతర అధికార యంత్రాంగం అంతా నిద్రహారాలు మానేసి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ అమెరికాలో ఈ వైరస్ బారిపడుతున్నవారితో పాటు.. మరణిస్తున్న వారి సంఖ్యకూడా పెరిగిపోతోంది.
తాజాగా అమెరికాలో గత 24 గంటల్లో ఏకంగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే, అమెరికాలో మొత్తం 34717 కేసులు నమోదు కాగా వీటిలో 1771 కొత్త కేసులు ఉన్నాయి. అదేవిధంగా మొత్తం 452 మంది చనిపోయారు. వీటిలో 33 కొత్త కేసులు ఉన్నాయి. మరో 795 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కేవలం 178 మంది మాత్రం ఈ వైరస్ బారినుంచి కోలుకున్నారు.
ఇదిలావుంటే భారత్ కూడా కఠిన చర్యలు చేపడుతోంది. విదేశాల నుంచి వచ్చిన వారిని చెక్ చేయాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు విదేశాల నుంచి ఢిల్లీకి 35 వేల మంది చేరుకున్నట్లుగా సమాచారం. వీరంతా తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. వీరంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారో లేదో తనిఖీ చేయాల్సిందిగా సీఎం కేజ్రీవాల్ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా వీరితో కాంటాక్ట్‌లో ఉన్నవారు సైతం రెండు వారాలు ఐసోలేషన్ పాటించాల్సిందిగా సూచించారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారిని ఇప్పటికే ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నేటి నుంచి మార్చి 31 వరకు ఢిల్లీ సైతం లాక్‌డౌన్ ప్రకటించింది. ఢిల్లీలో ప్రజా రవాణాను బంద్ చేశారు. రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. మెట్రో రైల్ సర్వీసులను కూడా నిలిపివేశారు. ప్రజలు గుంపులుగా చేరకుండా 144 సెక్షన్‌ను పోలీసులు అమలు చేస్తున్నారు.