ఆఫ్గాన్‌లో ముగిసిన అమెరికా పోరు - సంబరాలు చేసుకున్న తాలిబన్లు

మంగళవారం, 31 ఆగస్టు 2021 (10:21 IST)
us military flight
అగ్రరాజ్యం అమెరికా చిట్టచివరి విమానం ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ను వీడింది. అమెరికా రక్షణ దళాలతో కూడిన ఈ విమానం సోమవారం అర్థరాత్రి బయలుదేరింది. దీంతో అఫ్గాన్‌ గడ్డ నుంచి 20 ఏళ్ల అనంతరం అమెరికా రక్షణ దళాలు పూర్తిగా వెనుదిరిగాయి. ఈ విషయాన్ని అమెరికా రక్షణశాఖ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. 
 
'సైనికులు, పౌరులతో కూడిన చివరి విమానం లార్జ్‌ సీ-17 కాబుల్‌లోని హమీద్‌ కార్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం అర్థరాత్రి బయలుదేరింది. దీంతో అఫ్గాన్‌లో సైనికులు, పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తయింది' అని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ హెడ్‌ జనరల్‌ మెకంజీ పెంటగాన్‌లో ప్రకటించారు. 
 
ఈ విమానం బయలుదేరి వెళ్లడంతో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ విధించిన ఆగష్టు 31 గడువు తేదీలోపే అమెరికా దళాలు అఫ్గాన్‌ను ఖాళీ చేశాయి. అయితే గత వారం రోజుల నుంచి కాబుల్‌లో చోటుచేసుకున్న బాంబు దాడుల నేపథ్యంలో భారీ భద్రత నడుమ ఈ విమానం బయలుదేరింది.
 
ఆది నుంచి ఇరు పక్షాల మధ్య తీవ్ర శత్రుత్వం ఉన్నప్పటికీ అఫ్గాన్‌ నుంచి అమెరికా దళాలు, పౌరుల ఉపసంహరణలో తాలిబన్లు చాలా సహకరించారని, ఉపయుక్తంగా ఉన్నారని ఈ సందర్భంగా మెకంజీ పేర్కొన్నారు. మరోవైపు 20 ఏళ్ల అనంతరం అమెరికా దళాలు అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా ఖాళీ చేయడంతో తాలిబన్లు తుపాకులతో గాల్లోకి కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు