తాలిబన్లకు నయా రూల్ : అమ్మాయిలకు మగ అయ్యోర్లు చదువు చెప్పకూడదు

మంగళవారం, 31 ఆగస్టు 2021 (07:30 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్ తీవ్రవాదులు కఠినమైన షరియా చట్టాలను అమలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, తాజాగా నయా రూల్ ఒకటి పాస్ చేశారు. ఇకపై ఆప్ఘన్ దేశంలో అమ్మాయిలకు మగ అయ్యోర్లు చదువు చెప్పడానికి వీల్లేదంటూ హుకుం జారీచేశారు. 
 
నిజానికి ఈ దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత తాము మారిపోయామని, పాత పద్ధతులు అమలు చేయబోమంటూ మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేశారు. కానీ, అవన్నీ ఉత్తుత్తివేనని తమ చేష్టల ద్వారా నిరూపిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఆప్ఘాన్‌లోని తాజా పరిణామాలు చూస్తే మాత్రం.. ఈ ఉగ్రవాదులు మళ్లీ తమ అరాచక పాలన ప్రారంభిస్తున్నట్లే కనిపిస్తోంది. తాజాగా విద్యా వ్యవస్థపై తాలిబన్లు ఆంక్షలు విధించడం ప్రారంభించారు. గతంలో హెరాత్ ప్రావిన్స్‌లో ఉన్న యూనివర్సిటీల్లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదువుకునే కో-ఎడ్యుకేషన్ విధానాన్ని తాలిబన్లు రద్దు చేశారు.
 
ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో ఎక్కడా ఆడపిల్లలకు మగ టీచర్లు చదువు చెప్పకూడదని తాలిబన్లు రూల్ తెచ్చారు. ఈ మేరకు ఆఫ్ఘన్ ఉన్నత విద్యాశాఖ మంత్రి షేక్ అబ్దుల్ బాకీ హక్కానీ ఒక ప్రకటన చేశారు. కో-ఎడ్యుకేషన్ విధానాన్ని కూడా దేశవ్యాప్తంగా రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. షరియా చట్టం ప్రకారమే విద్యాసంస్థలు తమ కార్యకలాపాలు సాగించాలని స్పష్టం చేశారు.
 
ఉన్నత విద్యాశాఖ మంత్రిగా నియామకం జరిగిన మరుసటి రోజే హక్కానీ ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘన్‌లో విద్యా వ్యవస్థను మెరుగు పరిచేందుకు తాము ప్రయత్నిస్తున్నామని హక్కానీ అన్నారు. 
 
ఇప్పటి వరకూ నడిచిన విద్యా వ్యవస్థ షరియా చట్టాలకు విరుద్ధంగా నడిచిందని విమర్శించారు. అయితే తాలిబన్ల ఈ నిర్ణయాల పట్ల టీచర్లు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే బాలికలకు విద్య మరింత దూరమవుతుందని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు