శ్రీలంకలో మరిన్ని ఉగ్రవాద దాడులు : అమెరికా వార్నింగ్

శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (09:27 IST)
ఈస్టర్ సండే రోజున జరిగిన ఎనిమిది వరుస పేలుళ్ళలో శ్రీలంక రాజధాని కొలంబో దద్ధరిల్లిపోయింది. ఐసిస్ తీవ్రవాద సంస్థ మానవబాంబులతో మారణహోమం సృష్టించింది. ఈ దాడులో దాదాపు 400 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీంతో శ్రీలంకలో అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ)ని విధించి ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ వారంలో కూడా శ్రీలంకలో మరిన్ని దాడులు జరగొచ్చని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. అందువల్ల ఉగ్రదాడులపట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీలంకను హెచ్చరించింది. ఈ వారంలో అంటే ఏప్రిల్ 26 నుంచి 28వ తేదీ ఆదివారంలోపు కొలోంబోలోని ప్రార్థనాస్థలాలకు ప్రజలు వెళ్లవద్దని అమెరికా రాయబార కార్యాలయ అధికారులు ట్విట్టర్‌లో హెచ్చరించారు. ఎక్కువ మంది జనం గుమిగూడవద్దని కూడా అమెరికా రాయబార కార్యాలయం కోరింది.
 
దీంతో శ్రీలంక భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అనుమానాస్పద వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు, దేశంలో పోలీసు బందోబస్తును పెంచడంతోపాటు అనుమానితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టామని శ్రీలంక ప్రధానమంత్రి రాణిల్ విక్రమ్ సింఘే చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు