ఏమో... కరోనా చైనాలోనే పురుడు పోసుకుందేమో... డబ్ల్యూహెచ్ఓ

శుక్రవారం, 16 జులై 2021 (12:26 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చైనా వుహాన్ పరిశోధనా ల్యాబ్‌లో పుట్టిందని ప్రపంచ దేశాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొద‌టి నుంచి భిన్నంగా స్పందిస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్ అథనామ్‌ ఇప్పుడు ఆ వాద‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికేలా వ్యాఖ్య‌లు చేశారు. 
 
కరోనా పుట్టుక‌కు, అది ల్యాబ్‌ నుంచి లీక్‌ కావడానికి మధ్య ఎటువంటి సంబంధమూ లేదని ఎవరైనా కొట్టిపారేస్తే అది తొందరపాటే అవుతుందని వ్యాఖ్యానించారు. ఆ వైర‌స్ ఎక్కడ పుట్టిందన్న అంశంపై పరిశోధన కొన‌సాగుతోందని తెలిపారు. 
 
దీనిపై మరింత పారదర్శకంగా వ్యవహరించాలని చైనా ప్రభుత్వాన్ని కోరారు. కరోనా వెలుగులోకి వ‌చ్చిన రోజుల‌ నాటి సమాచారం ఇవ్వాల‌ని అన్నారు. వూహాన్‌ ల్యాబ్‌ నుంచే ఆ వైరస్‌ లీక్‌ అయినట్లు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది నమ్ముతున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు.
 
తాను కూడా ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేశాన‌ని, తాను ఇమ్యునాలజిస్టును అని చెప్పారు. కొన్ని ల్యాబ్‌ల్లో ప్రమాదాలు జరుగుతుండ‌డం సాధారణమేన‌ని చెప్పారు. అలాగే, కరోనా మూడో ద‌శ విజృంభ‌ణ ప్రారంభ దశలో ప్రపంచం ఉందని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 100కు పైగా దేశాల్లో డెల్టా వేరియంట్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు