ఇరాన్: బ్రిటీష్ దౌత్యకార్యాలయ సిబ్బంది అరెస్ట్

ఇరాన్‌లో ఈ నెల 12న జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటికీ సద్దుమణగలేదు. ఇరాన్‌లో అశాంతి నెలకొనడంపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నెలకొన్న ఉద్రిక్తతలపై పశ్చిమదేశాలు, ఇరాన్ నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరుగుతోంది.

ఇరాన్ ప్రభుత్వం ఆదివారం దీనికి ఆజ్యంపోసే నిర్ణయం మరొకటి తీసుకుంది. దేశంలో అశాంతికి సంబంధించి ఇరాన్ అధికారిక యంత్రాంగం టెహ్రాన్‌లో బ్రిటన్ దౌత్యకార్యాలయ సిబ్బందిని అరెస్టు చేసింది. బ్రిటీష్ దౌత్యకార్యాలయంలోని ఎనిమిది స్థానిక సిబ్బందిని ఇరాన్ అధికారిక యంత్రాంగం అరెస్టు చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇటీవలి ఉద్రిక్తతల్లో వీరి ప్రమేయం ఉందనే అనుమానంతో పోలీసులు బ్రిటిష్ కార్యాలయ సిబ్బందిని అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే అంతకుముందు బీబీసీ (బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్) కరస్పాండెంట్‌ను దేశం విడిచివెళ్లాలని ఇరాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తమ దేశంలో ఉద్రిక్తతలకు అమెరికా, బ్రిటన్, ఇతర పశ్చిమ దేశాలు ఆజ్యం పోస్తున్నాయని ఇరాన్ ప్రభుత్వం భావిస్తోంది.

వెబ్దునియా పై చదవండి