గిరిజన ప్రాంతాలపై కొనసాగుతున్న మానవ రహిత డ్రోన్ దాడులపై పాకిస్థాన్ గట్టిగా నిలబడింది. దేశంలో తీవ్రవాదులు లక్ష్యంగా సీఐఏ చేస్తున్న డ్రోన్ దాడులను ఆపాలని పాకిస్థాన్ అమెరికాను కోరింది. డ్రోన్ దాడులు ఆపాలని పాకిస్థాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ ఛీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షూజా పాషా సీఐఏ డైరక్టర్ మైకెల్ జే మోరెల్‌ను అధికారికంగా కోరినట్లు డాన్ పత్రిక తన కథనంలో వెల్లడించింది.
దాడులపై బహిరంగంగా అభ్యంతరం చెప్తున్న పాకిస్థాన్ అధికారికంగా దాడులు ఆపాలని అమెరికాను ఎప్పుడూ కోరలేదు. డ్రోన్ దాడుల్లో సామాన్య పౌరుల మృతి చెందుతుండటంతో స్థానిక ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతున్నట్లు అనేక మంది పాకిస్థాన్ నాయకులు పేర్కొంటున్నారు.
2004లో సీఐఏ డ్రోన్ దాడులు ప్రారంభించినప్పటి నుంచి అల్‌ఖైదా, తాలిబాన్ నాయకులతో సహా సుమారు 2,500 మంది మరణించారు. ఈ అమెరికా సంస్థ 2004 నుంచి ఇప్పటి వరకు 250 దాడులు చేసింది.