పాక్‌ ఐరాస కార్యాలయంవద్ద పేలుళ్ళుః ముగ్గురి మృతి

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోనున్న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం సమీపంలో సోమవారం పేలుళ్ళు సంభవించాయి. ఈ పేలుళ్ళలో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్ర గాయాలపాలైనారు.

పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమనున్న ఐక్యరాజ్యసమితి కార్యాలయ ఆవరణలోని ప్రపంచ ఆహార కార్యక్రమ కార్యాలయంలోని F-8 సెక్టారు వద్ద సోమవారం పేలుళ్ళు జరిగాయి. ఈ పేలుళ్ళ కారణంగా ఇద్దరు మృతి చెందగా పలువురు తీవ్ర గాయాలపాలైనట్లు స్థానిక మీడియా తెలిపింది.

ప్రపంచ ఆహార కార్యక్రమ కార్యాలయంలో ఈ దుర్ఘటన జరగడంతో ఐక్యరాజ్యసమితి కార్యాలయాధికారులు అక్కడున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని సూచించినట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి.

కాగా తీవ్ర గాయాల పాలైనవారిలో ఒకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య ముగ్గురికి చేరుకుందని అధికారులు తెలిపారు. అలాగే తీవ్ర గాయాల పాలైనవారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఇదిలావుండగా ప్రపంచ ఆహార కార్యక్రమ కార్యాలయానికి సమీపంలోనే పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఇల్లుండటం గమనార్హం. ఈ ఇల్లు అతని ప్రైవేట్ ప్రాపర్టీగా భావిస్తున్నారు. ఆ దేశాధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించక మునుపు ఈ ఇంట్లోనే నివాసముండేవారని మీడియా వర్గాలు వెల్లడించాయి.

కాగా ఇదే ప్రాంతంలో పలు పోలీసు ఉన్నతాధికారుల కార్యాలయాలు, జిల్లా కోర్టు కార్యాలయాలు, జిల్లా ఉన్నతాధికారుల కార్యాలయాలుండటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి