శ్రీలంక ప్రధాన ప్రతిపక్షం యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) నాయకుడు కరు జయసూర్య శుక్రవారం కీలకమైన భారత పర్యటనకు వచ్చారు. గత వారం జరిగిన స్థానిక ఎన్నికల్లో నిరుత్సాహకరమైన ఫలితాలను చవిచూసిన ఈ పార్టీలో నాయకత్వం సంక్షోభం తలెత్తింది.
యూఎన్‌పీకి తాత్కాలికంగా నాయకత్వం వహిస్తున్న జయసూర్య భారత పర్యటనకు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. శ్రీలంక మాజీ ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే, అధ్యక్ష పదవిని కోరుతున్న పార్టీకి చెందిన మరో నాయకుడు సజిత్ ప్రేమదాస మధ్య విబేధాల కారణంగా జయసూర్య యూఎన్‌పీ పగ్గాలు పొందారు.
స్థానిక కౌన్సిల్ ఎన్నికల్లో పార్టీ ఓటమితో మార్చిలో సమసిపోయిన నాయకత్వ సమస్య మళ్లీ మొదటికొచ్చింది. యూఎన్‌పీ పోటీ చేసిన 65 స్థానాల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. శ్రీలంక రాజకీయ, ఆర్థిక అంశాల మీద భారత్ ప్రభావం అధికం వున్న దృష్ట్యా ఆ దేశ ప్రధాన ప్రతిపక్ష నేత పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.