వాషింగ్‌టన్ చేరుకున్న దలైలామా

FILE
టిబెట్‌కు చెందిన ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా సోమవారం తన ఐదు రోజుల పర్యటనలో భాగంగా వాషింగ్‌టన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా తొలుత లేంటోస్ మానవాధికార పురస్కారాన్ని అందుకుంటారు. తదుపరి అమెరికాకు చెందిన చాలామంది సెనేటర్లను కలుసుకుంటారు. కాని ఈ కలయికలో అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామాను మాత్రం కలవలేకపోతున్నారు.

నవంబర్ నెలలో ఒబామా చైనా పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో తాను దలైలామాతో భేటీ అయితే చైనా నొచ్చుకుంటుందేమోననే సందేహంలోనే దలైలామాతో ఆయన కలవలేక పోతున్నారని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.

వచ్చే నెల ఒబామా చైనా పర్యటన అనంతరమే దలైలామాను కలుసుకుంటారని ఆయన ప్రత్యేక దూత లోడీ గ్యాలేస్టేన్ గ్యారీ తెలిపారు.

చైనా దేశం అమెరికాతో సత్సంబంధాలను కొనసాగించాలని దలైలామా తరచూ అంటుండేవారని ఆయన అన్నారు. వచ్చే నెలలో చైనా పర్యటన అనంతరం ఒబామా దలైలామాను కలిసి వారి స్థితిగతులను తెలుసుకుంటారని ఆయన వివరించారు.

ఇదిలావుండగా దలైలామా 1991వ సంవత్సరంలో జార్జ్ బుష్ సీనియర్ పరిపాలన కొనసాగించినప్పటి నుండి అమెరికా అధ్యక్షులతో సంప్రదింపులు జరిపి వారిని కలుసుకుంటుండేవారు.

కాగా చైనా దలైలామాను అమెరికా అధ్యక్షులతో కలవనీయకుండా అడ్డుపడుతోంది. ఒకవేళ అమెరికా అధ్యక్షులతో ఆయన సంప్రదింపులు జరిపితే టిబెట్‌ను చైనా నుంచి వేరు చేయాల్సి వస్తుందనేది చైనా భయం. ఇదివరకు 2007లో కూడా ఆయన ఓసారి అమెరికా సందర్శించియున్నారు.

వెబ్దునియా పై చదవండి