సీఎస్కే కెప్టెన్ 'సింగం సూర్య' ఖాతాలో అరుదైన రికార్డు...

ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (19:58 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు కాస్త ఇపుడు సింగం సూర్యగా మారిపోయింది. ఆయన తన గడ్డెం స్టైయిల్‌ను తమిళ హీరో సూర్య నటించిన సింగం చిత్రంలో పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నారు. అచ్చం సూర్య తరహాలోనే గడ్డెం పెట్టుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ధోనీ పేరు కాస్త సింగం సూర్యగా మారిపోయింది. అయితే, ఇపుడు ఈ సింగం సూర్య ఖాతాలో అరుదైన రికార్డు ఒకటి చేరిపోయింది. 
 
13వ సీజన్ ఐపీఎల్ 2020 ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడగా, ఇందులో సీఎస్కే జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్‌కు 100 విజయాలు అందించాడు. ఐపీఎల్ చరిత్రలో మరే కెప్టెన్ ఇన్ని విజయాలు సాధించలేదు. ఐపీఎల్‌లో 100 విజయాలు నమోదు చేసిన మొట్టమొదటి కెప్టెన్‌గా ధోనీ రికార్డు పుటల్లోకెక్కాడు.
 
అంతేకాకుండా, ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఐపీఎల్‌లో ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎనిమిది మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. అలాగే, చెన్నై జట్టు కూడా వరుసగా ఐదు పరాజయాలు చవిచూసిన నేపథ్యంలో నిన్నటి గెలుపుతో ఈ పరంపరకు అడ్డుకట్ట వేశాడు. 
 
కాగా, ధోనీ 2019 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ తో సెమీఫైనల్ తర్వాత మళ్లీ క్రికెట్ బరిలో దిగలేదు. 437 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ తాజా సీజన్‌లో మళ్లీ ఆట మొదలుపెట్టాడు. ఇటీవల ఆగస్టు 15న ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంటు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు