మిడిల్ స్టంప్‌ను రెండు ముక్కలు చేసిన ట్రెంట్ బౌల్ట్ బంతి!!

సోమవారం, 14 సెప్టెంబరు 2020 (08:50 IST)
బీసీసీఐకి కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ పోటీలు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. దీంతో ఈ టోర్నీలో పాల్గొనే ఎనిమిది జట్లూ ఇప్పటికే యూఏఈకి చేరుకుని, ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. పైగా, ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్ ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగనుంది. దీంతో టోనీ ఆరంభమే హోరాహోరీగా సాగనుంది. 
 
ఇదిలావుంటే, ముంబై ఇండియన్స్ జట్టు బౌలర్లు విక్కెట్లను ముక్కలు చేస్తున్నారు. తాము విసిరే బంతులకు వికెట్లు రెండుగా విరిగిపోతున్నాయి. తాజాగా ముంబై ఇండియన్స్ జట్టులోకి కొత్తగా వచ్చి చేరిన ట్రెంట్ బౌల్ట్ నెట్‌లో చెలరేగిపోతున్నాడు. హెడ్‌కోచ్ మహేళ జయవర్ధనే పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్న ట్రెంట్ బౌల్ట్ తనలోని మొత్తం శక్తిసామర్థ్యాలను వెలికి తీస్తున్నాడు.
 
నెట్స్‌లో ఫుల్ స్టీమ్‌తో బంతులు విసురుతూ చెమటోడ్చుతున్నాడు. ఈ క్రమంలో అతడు విసిరిన ఓ బంతి మిడిల్ స్టంప్‌ను రెండు ముక్కలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ.. 'క్లీన్ బౌల్ట్! ట్రెంట్ వచ్చేశాడు' అని క్యాప్షన్ తగిలించింది. 
 
ఇదిలావుంటే, ఐపీఎల్ 2020 టోర్నీలోని ఎనిమిది టీమ్స్‌కు ఎమోజీలు, హ్యాష్‌టాగ్స్‌ను ట్విట్టర్‌ విడుదల చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. 
 
ఇప్పటికే ఐపీఎల్ 2020 సీజన్ గురించి ట్విట్టర్‌లో చర్చ మొదలవగా.. ట్విటర్‌ ప్రకటనతో అభిమానులకి కొత్త అనుభూతి లభించనుంది. అయితే ఇంగ్లీష్‌తో పాట వివిధ ప్రాంతీయ భాషల్లో క్యాప్షన్‌లున్న ఎమోజీలు, హ్యాష్‌టాగ్స్‌లను ట్విటర్‌ విడుదల చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు