ఐపీఎల్ బ్యాటింగ్ సెన్సేషన్ .. ఎవరీ రాహుల్ తెవాటియా?

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (17:12 IST)
ఐపీఎల్ 2020 టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో పరుగుల సునామీ వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఆ తర్వాత చేజింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ పరుగుల మోత మోగించాయి. 
 
ముఖ్యంగా పంజాబ్ తరఫున సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్, కెప్టెన్ కేఎల్ రాహుల్ రాణించగా, రాజస్థాన్ జట్టులో సంజు శాంసన్, రాహుల్ తెవాటియా అద్భుతంగా రాణించి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. ముఖ్యంగా, రాహుల్ తెవాటియా ఆడిన సంచలన ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అని చెప్పాలి.
 
మొదట నత్తనడకన బ్యాటింగ్ చేసి అందరిలో అసహనం కలిగించిన తెవాటియా ఆ తర్వాత గేర్లు మార్చి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన వైనం క్రికెట్ అభిమానులను విశేషంగా అలరించింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కాట్రెల్ బౌలింగ్‌కు రాకముందే తెవాటియా స్కోరు 23 బంతుల్లో 17. 
 
కానీ ఆ ఓవర్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేశాడీ ఎడమచేతివాటం ఆటగాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా ఐదు భారీ సిక్సర్లు కొట్టి అసాధ్యమనుకున్న లక్ష్యఛేదనను సుసాధ్యం చేశాడు. 31 బంతుల్లో 53 పరుగులు చేసిన తెవాటియా మొత్తం 7 సిక్సర్లు బాదాడు. తను ఔటౌనా అప్పటికే రాజస్థాన్‌ను విజయానికి దగ్గరగా చేర్చాడు.
 
రాయల్స్ బ్యాటింగ్ లైనప్‌లో అతనొక్కడే లెఫ్ట్ హ్యాండర్ కావడంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపారు. ఈ ఎత్తుగడ మొదట్లో బెడిసికొట్టినట్టే కనిపించింది. బ్యాటు ఊపుతున్నా బంతి తగలకపోవడంతో రాజస్థాన్ శిబిరంలో ఆందోళన మొదలైంది. కానీ, ఒక్కసారిగా విశ్వరూపం ప్రదర్శించి బంతిపై విరుచుకుడిన తెవాటియా తనపై మొదలైన అసహనాన్ని, కాసేపట్లోనే ఆవిరి చేశాడు. 
 
ఇప్పటిదాకా ఓ అనామకుడిలా జట్టులో కొనసాగిన రాహుల్ తెవాటియా ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. తెవాటియా దెబ్బకు మయాంక్ అగర్వాల్ సెంచరీ, సంజూ శాంసన్ వీరోచిత బ్యాటింగ్ కూడా మరుగునపడ్డాయి.
 
తివాటియా ఇప్పుడో సెన్సేష‌న్‌. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత‌ను స్థానం సంపాదించుకున్నాడు. పంజాబ్ విసిరి 224 ప‌రుగుల ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ చేధించింది. దానికి తివాటియానే ప్ర‌ధాన కార‌ణం. తివాటియా స్ట‌న్నింగ్ బ్యాటింగ్‌ను ప్ర‌ద‌ర్శించాడు. 
 
భారీ స్కోర్‌ను చేధించేందుకు.. హ‌ర్యానాకు చెందిన స్పిన్న‌ర్ రాహుల్ తివాటియాను బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో నాలుగో స్థానంలోకి దింపారు. ఆ ఎత్తుగ‌డ అంద‌ర్నీ షాక్‌కు గురి చేసింది. పెద్ద పెద్ద ప్లేయ‌ర్లు ఉన్నా.. తివాటియాను ఎందుకు ముందు ఆర్డ‌ర్‌లో పంపారో ఎవ‌రికీ అర్థం కాలేదు. 
 
బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో రాబిన్ ఊత‌ప్ప ముందు వ‌రుస‌లో ఉన్నా.. తివాటియాను దింప‌డం కొంత టెన్ష‌న్ పుట్టించింది. తివాటియా ఆరంభం న‌త్త‌న‌డ‌క‌లా సాగింది. 10 బంతుల్లో 5 ర‌న్స్ చేశాడు. 16 బంతుల్లో 7కు చేరుకుంది అత‌ని స్కోర్‌. ఆ త‌ర్వాత 21 బంతుల్లో 14కు మారింది. 23 బంతుల్లో 17 ర‌న్స్ స్కోర్ చేసి ఇక ఆశ‌లు గ‌ల్లంతు అయిన‌ట్లే అని భావించేలా చేశారు. 
 
టార్గెట్ భారీగా ఉన్నా తివాటియా మాత్రం తొలుత భారీ షాట్ల‌కు వెళ్ల‌లేదు. కానీ 18వ ఓవ‌ర్‌లో విండీస్ స్పీడ్‌స్ట‌ర్ షెల్డ‌న్ కాట్ర‌ల్ వేసిన బౌలింగ్‌లో చిచ్చ‌ర‌పిడుగులా మారాడు. కాట్ర‌ల్‌కు చుక్క‌లు చూపించాడు. విండీస్ బౌల‌ర్‌ను న‌లువైపులా కొట్టాడు. 
 
ఆ ఓవ‌ర్‌లో ఐదు సిక్స‌ర్లు కొట్టిన తివాటియా.. 29 బంతుల్లో 47 ర‌న్స్ చేసి మొత్తం మ్యాచ్ స్వ‌రూపాన్నే మార్చేశాడు. 31 బంతుల్లో 53 ర‌న్స్ చేయాల్సిన ప‌రిస్థితి నుంచి 23 బంతుల్లో 17 ర‌న్స్ టార్గెట్‌కు రాజ‌స్థాన్‌కు తివాటియా తీసుకువెళ్లాడు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ టోర్నీలో చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
ఇంతకీ ఎవరీ తెవాటియా... అంటే నిన్నటి మ్యాచ్ కు ముందు వరకు ఓ సాధారణ లెగ్ స్పిన్నర్ అని చెప్పాలి. కానీ తనలోని హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్‌మన్‌ను సమయానుకూలంగా బయటికి తెచ్చి నికార్సయిన టీ20 ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ తెవాటియా హర్యానాకు చెందిన ఆటగాడు. 
 
వయసు 27 సంవత్సరాలు. ఇప్పటివరకు తన కెరీర్ లో 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అందులో మనవాడు చేసింది 190 పరుగులే. యావరేజ్ 17.27. లిస్ట్-ఏ పోటీల్లో 21 మ్యాచ్‌లు ఆడి 484 పరుగులు చేసినా వాటిలో ఒక్క సెంచరీ కూడా లేదు.
 
బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించే తెవాటియా 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. లిస్ట్-ఏ పోటీల్లో 21 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. 2013లో దేశవాళీ క్రికెట్‌లోకి వచ్చినా, అక్కడ కూడా పెద్దగా మెరుపులేవీ మెరిపించలేదు. 
 
కానీ ఐపీఎల్ పుణ్యమా అని నిన్న ఒక్క మ్యాచ్‌తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఓవైపు కాట్రెల్ 140 కిమీ పైచిలుకు వేగంతో బంతులు వేస్తున్నా, అంతకంటే బలంగా వాటిని స్టాండ్స్‌‌లోకి పంపిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 
 
తెవాటియా గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల తరపున ఐపీఎల్‌లో ఆడినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. తనను అందరూ పట్టించుకునేలా అతను ఆడిందీ లేదు. గతరాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్ అతడి కెరీర్ ను మలుపు తిప్పుతుందనడంలో సందేహం అక్కర్లేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు