రంజీ, దేశీవాళీ క్రికెటర్లపై ఫ్రాంచైజీల దృష్టి.. జాక్‌పాట్ కొట్టిన వరుణ్, శివమ్

మంగళవారం, 18 డిశెంబరు 2018 (18:23 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019లో భాగంగా జరిగిన వేలం పాటలో ఫ్రాంచైజీ యజమానులు యంగ్ క్రికెటర్లపై దృష్టి పెట్టారు. దేశవాళీ క్రికెట్ పోటీల్లో రాణించే యంగ్ క్రికెటర్లను తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. ఇందులో భాగంగా ఒకరు రంజీ ట్రోఫీ హీరో, ముంబైకి చెందిన శివమ్ దూబే, మరొకరు తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అదరగొట్టిన క్రికెటర్ వరుణ్ చక్రవర్తిని ఫ్రాంచైజీలు తీసుకున్నాయి. దేశీయ క్రికెట్‌లో సంచలనాలు సృష్టించడంతో వీరిద్దరూ  ఐపీఎల్‌లో జాక్‌పాట్ కొట్టేశారు. 
 
ముంబైతో జరిగిన ఓ దేశీయ ట్వంటీ-20 మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు శివమ్ దూబే. ఇంకా రంజీ ట్రోఫీలో 139 బంతుల్లో 114 పరుగులు, 110 బంతుల్లో 128 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ఆడిన ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 22 వికెట్లు తీశాడు. దీంతో ఈ ఐపీఎల్‌ వేలంలో రూ.20 లక్షల బేస్ ధరతో ఇతని వేలం మొదలై.. ఏకంగా రూ.5 కోట్లకు అమ్ముడుపోయాడు.
 
ఇదే విధంగా తమిళనాడు ప్రీమియర్ లీగ్‌‌లో మధురై పాంథర్స్ జట్టు తరఫున ఆడిన వరుణ్ చక్రవర్తి.. జట్టుకి టైటిల్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ 27 ఏళ్ల క్రికెటర్.. మొత్తం ఏడు విధాలుగా బౌలింగ్ చేసి.. మిస్టరీ బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. బౌలింగ్‌లోనూ రాణించాడు. ఈ ఐపీఎల్‌ వేలంలో రూ.20 లక్షల బేస్ ధరతో ఇతని వేలం మొదలై.. ఏకంగా రూ.8.4 కోట్లకి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇతన్ని దక్కించుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు