త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ

ఆదివారం, 10 జులై 2022 (11:34 IST)
ముస్లిం సోదరుల పవిత్ర పండుగల్లో ఒకటైన బక్రీద్‌ను ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. త్యాగానికి ప్రతీకగా భావించే ఈ పండుగ (ఈద్ ఉల్ అదా)ను జరుపుకునేందుకు దేశం యావత్తూ ముస్తాబైంది. పండుగ సందర్భంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. 
 
ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ముస్లిం క్యాలెండర్ (చంద్రుని గమనం) ప్రకారం పరమ పవిత్రమైన బక్రీద్‌ను జరుపుకోనున్న ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు. 
 
మసీదులు, ఇళ్లలో ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఖుర్బానీ పేరిట జంతువులను బలిచ్చి ఆ మాంసాన్ని పేదలకు దానం చేస్తారు హజరత్ ఇబ్రహీం అనే ప్రవక్త త్యాగఫలమే బక్రీద్ అని ముస్లింలు విశ్వసిస్తున్నారు. ఇబ్రహీం దంపతులకు కొన్నేళ్లపాటు పిల్లలు జన్మించలేదు. దైవానుగ్రహం వల్ల లేకలేక జన్మించిన పుత్రుడికి వారు ఇస్మాయేల్ అనే పేరు పెట్టారు. 
 
తమకు కుమారుడు పుట్టాడని ఆనందంలో ఉన్న ఇబ్రహీంకు ఓ రోజు కల వస్తుంది. అందులో, తన పుత్రుడు ఇస్మాయేల్ మెడను కత్తితో కోస్తున్నట్లు భావిస్తాడు. అల్లాహ్ ఖుర్బానీ కోరుతున్నాడేమోనని భావించి ఆ సమయంలో ఒంటెను బలిస్తాడు. అయితే ఆయనకు మళ్లీ అదే కల వస్తుంది. 
 
వెంటనే ఇస్మాయేల్ మెడపై కత్తి పెట్టి 'జుబాష్-ఇహ్'కు ఇబ్రహీం సిద్ధపడగా, వారి త్యాగానికి మెచ్చుకున్న అల్లాహ్ ప్రాణత్యాగానికి బదులుగా ఓ జీవాన్ని బలివ్వాలని కోరడం, ఇబ్రహీం జీవాన్ని బలిచ్చే ఘట్టాన్ని బక్రీద్ రోజు ఖుర్బానీగా పాటిస్తున్నట్లు ముస్లిం పెద్దలు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు