ఆ క్షేత్రంలో బెల్లం పానకాన్ని తాకని చీమలు

Munibabu

శుక్రవారం, 18 జులై 2008 (13:05 IST)
బెల్లం లేదా చక్కెరను ఇంట్లో ఎంత జాగ్రత్తగా పెట్టినా దానికి చీమలు పట్టేస్తుంటాయి. అలాగే కాస్త చక్కెరో, బెల్లమో ఎక్కడైనా పడిందంటే కొన్ని క్షణాలకే చీమల గుంపు అక్కడ ప్రత్యక్షమై పోతుంది. ఈ విషయం మనకందరికీ తెలిసిందే కదా. దీనికి కారణం చీమలకున్న గ్రహణశక్తేనని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.

కొద్దిపాటి తీపి వాసన అయినా సరే చాలా దూరం నుంచే చీమలు గ్రహించగల్గుతాయని అందుకే తీపి వాసన ఉన్న ప్రదేశానికి చీమలు వచ్చేస్తాయని వారు వివరిస్తుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మంగళగిరి క్షేత్రానికి మాత్రం ఈ సూత్రం వర్తించదు. ఎందుకు వర్తించదనే విషయాన్ని చెప్పేముందు మంగళగిరి క్షేత్రం గురించి కాస్త చెప్పాలి.

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతమైన విజయవాడ పట్టణానికి దాదాపు పదికిలోమీటర్ల దూరంలో వెలసిన క్షేత్రమే నృసింహ స్వామి క్షేత్రం. మహా విష్ణువు అవతారమైన నరసింహస్వామి శ్రీమహాలక్ష్మి సమేతుడై ఇక్కడ పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయంలో మరో విశేషం ఉంది. లక్ష్మీ సమేతుడైన శ్రీనరసింహుని అవతారంతో పాటు పానకాలరాయుడు పేరుతో మరో రూపంలో స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు.


ఈ స్వామి వారి ప్రత్యేకత ఏంటంటే భక్తులు సమర్పించే పానకాన్ని మొత్తంగా స్వీకరించే స్వామివారు అందులోని కొంతభాగాన్ని భక్తులకు తిరిగి వెనక్కు ఇచ్చేస్తుంటారు. భక్తులు ఎంత పరిమాణంలో పానకం సమర్పించినా సరే అందులో ఖచ్చితంగా సగభాగాన్నిమాత్రం స్వామివారు వెనక్కి ఇచ్చేస్తారు. చిత్రంగా వుంది కదూ... అయినా ఇది నిజం.

భక్తులు తాము తెచ్చిన పానకాన్ని స్వామివారికి సమర్పించిన తర్వాత స్వామి నోటినుండి సగభాగం పానకం వెలుపలకి వచ్చేస్తుంది. ఆ పానకాన్ని అత్యంత భక్తితో భక్తులు సేవిస్తుంటారు. మంగళగిరి క్షేత్రంలో జరిగే ఈ వింతను ప్రత్యక్షంగా చూడడానికే భక్తులు అనునిత్యం వేలాదిగా తరలివస్తుంటారు.

ఇప్పటివరకు చెప్పిన ఈ విశేషంలోనే మనం ప్రారంభంలో చెప్పుకున్న విశేషం కూడా ఉంది. వేలాదిగా వచ్చే భక్తులు తమవెంట పానకాన్ని తీసుకువచ్చి ఇక్కడ స్వామివారికి సమర్పించడం, స్వామివారు తిరిగి ఇచ్చిన పానకాన్ని తాము సేవించడం లాంటి కార్యక్రమాల సందర్భంగా ఎంత పానకం కిందపడ్డా ఈ క్షేత్రంలో ఒక్క చీమ కూడా కన్పించదు.

బెల్లం కలిపి చిక్కగా తయారు చేసే పానకం సువాసనకు మనం ఎంతగా ఆకర్షితమవుతామో తెలిసిందే. అలాంటి ఆ పానకం కొన్ని చుక్కలు కిందపడ్డా క్షణాల్లో చీమలు చేరిపోవడం చూస్తుంటాం. అలాంటిది ఈ క్షేత్రంలో ఎంత పానకం కింద ఒలికినా ఒక్క చీమ కూడా రాకపోవడం నిజంగా క్షేత్ర మహిమే కదూ... అంతా ఆ నృసింహ స్వామి మహిమ.

వెబ్దునియా పై చదవండి