యాపిల్ ఐఫోన్-8 స్మార్ట్ ఫోన్ వివరాలు లీక్... ఫీచర్లు ఏంటంటే?

మంగళవారం, 7 మార్చి 2017 (09:11 IST)
స్మార్ట్ ఫోన్ల తయారీలో యాపిల్ కంపెనీ ఒకటి. ఇప్పటివరకు ఈ కంపెనీ మొత్తం ఏడు సిరీస్‌లలో ఈ ఫోన్లను విడుదల చేసింది. అనతికాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. దీంతో ఈ కంపెనీ విడుదల చేసే ప్రతి ఐఫోన్‌పై ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొంటుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు విడుదల చేసిన ఐఫోన్ 7 ప్లస్ సిరీస్ కంటే లేటెస్ట్ ఫీచర్స్‌తో ఐఫోన్ 8ను విడుదల చేయనున్నట్టు యాపిల్ ప్రకటించింది. ఈ యాపిల్ 8 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి.
 
ఈ ఫోన్‌ ప్రత్యేకత 5.8 అంగుళాల ఓలెడ్ (ఓఎల్‌ఈడీ) డిస్‌ ప్లే. దీనిని 'ఐఫోన్ ఎక్స్'గా పిలువనున్నారు. అప్‌‌డేటెడ్ వెర్షన్ అయిన ఇది ఐఫోన్ 7 ప్లస్ కంటే చిన్నగా ఉండనున్నట్టు తెలుస్తోంది. దీని డిస్ ప్లే 5.8 అంగుళాలుగా చెబుతున్నప్పటికీ... దీని డిస్‌ప్లే కేవలం 5.15 అంగుళాలు మాత్రమే ఉండనుంది. 
 
మిగిలిన 0.65 అంగుళం ఫంక్షనింగ్ ఏరియాగా ఉంటుంది. ఇది యుఎస్‌బి-సి మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యంతో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. త్వరితగతిన చార్జ్ కావడం దీని ప్రత్యేకత. దీని ధర సుమారు వెయ్యి డాలర్లుగా నిర్ణయించినట్టు లీకైన వార్తలు చెబుతున్నాయి. దీనిని బట్టి ఇప్పటివరకు ఇదే అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ అని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి