రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. దేశంలో స్వదేశీ టెలికాం సేవలను ప్రారంభించి నవశకానికి నాంది పలికారు. ఆయన నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇపుడు దేశంలోనే అత్యున్నత స్థాయి సేవలతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ మరో లక్ష్యాన్ని ఎంచుకున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పాఠశాలలన్నీ ఇపుడు ఆన్‌లైన్ క్లాసుల వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే, దీనికి స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. కానీ, కోట్లాది మంది విద్యార్థులకు ఈ తరహా ఫోన్లు లేవు. దీంతో త్వరలో రూ.4 వేలకే అన్ని ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ను దేశ ప్రజలకు పరిచయం చేయాలని ఆయన భావిస్తున్నారు.
దేశ మొబైల్‌ఫోన్ రంగంలో మరింతగా దూసుకుపోయేలా ముఖేశ్ అంబానీ కొత్తగా 'జియో స్మార్ట్‌ఫోన్'పై దృషి సారించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రెండేళ్లలో 20 కోట్ల స్మార్ట్‌ఫోన్లను దేశీయంగా తయారు చేయించాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది. నిజానికి స్మార్ట్‌ఫోన్ కొనలేని పరిస్థితుల్లో ఉన్న 50 కోట్ల మంది అర చేతుల్లో 'జియో స్మార్ట్‌ఫోన్' ఉండాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
కానీ, దేశీయ ఉత్పత్తి రంగం ఆ టార్గెట్‌ను అందుకోవడం సాధ్యం కాకపోవడంతో.. రెండేళ్ల కాలంలో 20 కోట్ల ఫోన్ల తయారీపై దృష్టిసారించారు. అంబానీ తాజా నిర్ణయం దేశీయ స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తిదారులకు ఊతమిచ్చినట్లవుతుందని ఇండియన్ సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ ఛైర్మన్ పంకజ్ మొహింద్రూ అన్నారు.