రిలయన్స్ జియో ఉచిత డేటాతో ఎవరెంత ప్రయోజనులయ్యారో కానీ.. ఉచిత డేటాతో ఫేస్‌బుక్ లాభాలను గడించింది. ఉచిత డేటా ఆఫర్లు ఫేస్‌బుక్ పాలిట వరంగా మారాయి. భారత్‌లో టెలికాం ఆపరేటర్లు పోటీలు పడి ఉచిత డేటా ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ త్రైమాసికంలో సోషల్ మీడియాలో దిగ్గజమైన ఫేస్ బుక్ ఆదాయం గణనీయంగా పెరిగింది.
డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఫేస్ బుక్ ఆదాయం 51 శాతం మేర పెరిగి.. 8.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. డిసెంబర్ త్రైమాసికంలో ఫేస్‌బుక్ మొబైల్ ప్రకటనల రాబడి 53 శాతం పెరిగి 8.6 బిలియన్ డాలర్లకు చేరుకొంది. భారత్ వంటి దేశాల్లో థర్డ్‌పార్టీ ఉచిత డేటా ఆఫర్లతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో స్పష్టమైన ప్రభావం కనిపించిందని ఫేస్‌బుక్ ఓ ప్రకటనలో వెల్లడి చేసింది. భారత్ వంటి దేశాల్లో ఉచిత డేటా ఆఫర్ల వెల్లువతోనే ఇది సాధ్యమైందని ఫేస్‌బుక్ ముఖ్య ఆర్థిక అధికారి డేవిడ్ వెహ్నర్ స్పష్టం చేశారు.