జియో రాకతో టెలికాం సంస్థల మధ్య వార్ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎయిర్‌టెల్-రిలయన్స్ జియో మధ్య నువ్వా నేనా అంటూ వార్ జరుగుతోంది. ఇస్తామన్న ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లు (పిఒఐ) కూడా ఇవ్వకుండా ఎయిర్‌టెల్ మోసం చేసిందని రిలయన్స్ జియో ఆరోపించింది. నంబర్ పోర్టబులిటీ కింద ఎయిర్‌టెల్ నుంచి రిలయన్స్ జియో నెట్‌వర్క్‌కు మారే కస్టమర్లను ఎయిర్‌టెల్ ముప్పు తిప్పలు పెడుతోందని జియో విమర్శించింది.
ప్రస్తుతం మార్కెట్‌లో తనకున్న ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తూ పోటీని నీరుగార్చేలా ఎయిర్‌టెల్ ప్రవర్తిస్తోందని రిలయన్స్ జియో ఆరోపించింది. దీనివల్ల జియో ఖాతాదారులు ఉచితంగా నాణ్యమైన వాయిస్ సేవలు అందుకోవడం సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. కానీ ఎయిర్‌టెల్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. జియో అవసరాల కంటే ఎక్కువ ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లే ఇచ్చామని తెలిపింది.