కొద్దిగా చిరాకుగా అనిపించినా, అనారోగ్యంగా ఉన్నా, అలసటగా ఉన్నా... "అమ్మ" కొంగుపట్టుకు తిరిగే చిన్నారులు అందరిళ్లలోనూ ఉండటం సహజం. అయితే అమ్మకు బదులుగా తండ్రి వద్ద ఉంటే పిల్లలు త్వరగా కోలుకుంటారని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది.
చిన్నారుల మనస్తత్వాలపై "ఏలే స్కూల్ ఆఫ్ మెడిసిన్"కు చెందిన ప్రొఫెసర్ కైలేపురేట్ నిర్వహించిన పై అధ్యయనంలో.. అనారోగ్య సమయంలో చిన్నపిల్లలు తల్లివద్ద కంటే, తండ్రివద్ద ఉంటేనే త్వరగా కోలుకుంటారని తేలింది. పదహారు వారాలపాటు మురికివాడలు, ధనిక ప్రాంతాలలో స్వయంగా తిరిగి, పిల్లలతో మాట్లాడి ఈ సర్వేను నిర్వహించినట్లు కైలేపురేట్ వివరించారు.
చిన్నారులకు అనారోగ్యంగా ఉన్నప్పుడు తండ్రి సాన్నిహిత్యంలో ఉన్నట్లయితే చాలా త్వరగా కోలుకుంటారని కైలేపురేట్ తేల్చి చెబుతున్నారు. పిల్లల ఆరోగ్యం సరిగా లేనప్పుడు వారు తల్లికంటే, తండ్రి సాన్నిహిత్యాన్నే ఎక్కువగా కోరుకుంటారనీ, తండ్రి సమీపంలో ఉన్నట్లయితే వారిలో తెలియని భద్రత ఏర్పడి ధైర్యంగా ఉంచుతుందని.. తద్వారా వారు త్వరగా కోలుకుంటారని ఆయన తెలియజేశారు.
చిన్నారులు తల్లి ప్రేమను, తండ్రి ప్రోత్సాహాన్ని కోరుకోవటం సహజమేననీ.. అయితే నేటి స్పీడ్ యుగంలో, ఉద్యోగ జీవితాల కారణంగా నాన్నలు వారి తగినంత శ్రద్ధ తీసుకోక వారిని నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారనీ... దీంతో అది పిల్లల మానసిక స్థితిపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన నిపుణులు వాపోతున్నారు.