పక్కతడిపే అలవాటును మాన్పించడం ఎలా..?

పక్కతడిపే పిల్లలచేత ఆ అలవాటును మాన్పించాలంటే.. తల్లిదండ్రులకు ఒక అగ్ని పరీక్షలాంటిదనే చెప్పవచ్చు. అలాగే, ఆ అలవాటును మానడం అనే విషయం పిల్లలకు కూడా అగ్నిపరీక్షే. పైగా.. ఈ విషయాన్ని వారి స్నేహితులకు తెలియకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటారు ఇలాంటి గడుగ్గాయిలు.

అయితే, ఈ గడుగ్గాయిల పక్కతడిపే (పడకమీదే పాస్ పోసుకోవడం) అలవాటును మాన్పించటం అంత కష్టమేమీ కాదని అంటున్నారు పిల్లల వైద్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దామా...?!

పిల్లలు నిద్రకు ఉపక్రమించేందుకు కనీసం ఒక గంటకు ముందునుంచే నీళ్లు, ఇతర ద్రవపదార్థాల లాంటివి ఇవ్వకూడదు. దాహంగా ఉండి, తప్పనిసరిగా నీళ్లు త్రాగించాల్సి వస్తే.. పావు గంటసేపు ఏదైనా వ్యాపకం కల్పించి, నిద్రపోవడాన్ని వాయిదా వేసి, మరోసారి టాయ్‌లెట్‌కు పంపించి ఆపై నిద్రబుచ్చాలి.

అలాగే.. మధ్యలో ఓసారి పిల్లల్ని లేపి టాయ్‌లెట్‌కు తీసుకెళ్లాలి. క్రమం తప్పకుండా ఓ వారం రోజులపాటు ఒకే సమయానికి నిద్రలేపడం అలవాటు చేయాలి. ఈ మాత్రం తల్లిదండ్రులు కష్టపడినట్లయితే.. తరువాత పిల్లలకు అలవాటయిపోతుంది. నిద్రపోయినప్పటికీ ఆ సమయానికి టాయ్‌లెట్‌కు వెళ్లాల్సిన అవసరం ఏర్పడి నిద్రలోనే కదులుతుంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు గమనించి తీసికెళ్తే... కొంత ఊహ వచ్చిన తరువాత మరొకరి సహాయం లేకుండా వాళ్లే లేచి వెళ్తుంటారు.

అయితే.. పక్క తడిపే అలవాటు మానడం అనేది రాత్రిపూట లేవాలని చెప్పినంత సులభం మాత్రం కాదు. కాబట్టి, రాత్రి ఒకటి లేదా రెండు గంటల సమయాన్ని సెట్ చేసి అలారం పెట్టుకోవడం మంచిది. అలారం మోగినప్పుడు లేచి టాయ్‌లెట్‌కు వెళ్లి రావడం పిల్లలకు అలవాటవుతుంది.

ఇక చివరగా.. స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల గాల్‌బ్లాడర్ సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా అది ఎక్కువ మోతాదులో మూత్రాన్ని నిలుపుకోగలుగుతుంది. అలాంటప్పుడు రాత్రిపూట మధ్యలో పిల్లలు లేవాల్సిన అవసరం అంతగా ఉండదు. అయితే ఈ స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్‌లను నిపుణుల పర్యవేక్షణలోనే పిల్లలకు నేర్పించాలి. అలాగే, పిల్లలు వాటిని క్రమం తప్పకుండా సాధన చేసేందుకు తల్లిదండ్రులు సహకరించాలి.

వెబ్దునియా పై చదవండి