బాలీవుడ్ అందాలరాశి, మాజీ ప్రపంచ సుందరి, అమితాబ్ బచ్చన్ ఇంటి కోడలు ఐశ్వర్యారాయ్ బార్బీ బొమ్మగా మారనుంది. బార్బీ బొమ్మలను తయారు చేస్తున్న మాటెల్ కంపెనీ ఈ మేరకు ఐశ్వర్యారాయ్‌తో ఓ ఒప్పందం కుదుర్చుకోనుందని ఐష్ సమాచార ప్రతినిధి వెల్లడించారు. ఇంతవరకు తెరపై ప్రేక్షకులను అలరించిన ఈ అందాల ముద్దుగుమ్మ, ఇకపై బార్బీ బొమ్మగా చిన్నారుల మనసును దోచుకోనుంది.
బార్బీ 50వ సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా ఐశ్వర్యారాయ్ బార్బీ బొమ్మను తయారు చేసేందుకు మాటెల్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. హాలీవుడ్ నటి నవోమి కాంప్‌బెల్ తర్వాత ఐశ్వర్యారాయ్‌కి బార్బీ బొమ్మగా మారే అవకాశం దక్కిందని, ఇప్పటికే లాక్మీ ఫ్యాషన్ వీక్‌లో ఐష్ బార్బీ డిజైన్ బొమ్మ విడుదలైందని సినీ వర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా.. అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌ను వివాహమాడిన ఐశ్వర్యారాయ్‌కు సినిమాల్లో నటించే అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయి. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ సరసన "యందిరన్"లో ఐష్ నటిస్తోంది. అంతేకాదు.. త్వరలో అభిషేక్-ఐశ్వర్యారాయ్‌లు తల్లిదండ్రులు కాబోతున్నారని ముంబై సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.