చిలకమ్మ పెండ్లికి చెలికత్తెలు

సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (19:08 IST)
చిలకమ్మ పెండ్లికి... చెలికత్తెలందరూ
చెట్లు సింగారించి... చేరి కూర్చున్నారు
పందిట పిచ్చుకలు... సందడి చేయగ
కాకుల మూకలు... బాకాలూదగ

కప్పలు బెకబెక... డప్పులు కొట్టగ
కొక్కొరోకోయని... కోడి కూయగా
ఝుమ్మని తుమ్మెద... తంబుర మీటగ
కుహూ కుహూయని.. కోయిల పాడగా

పిల్ల తెమ్మరలు... వేణువూదగా
నెమలి సొగసుగా... నాట్యం చేయగా
సాళిడిచ్చిన... చాపు కట్టుకుని
పెండ్లికుమారుడు... బింకము చూపగా

మల్లీ మాలతి... మాధవీ లతలు
పెండ్లి కుమారుని... పెండ్లి కూతురిని
దీవిస్తూ తమ... పూవులు రాల్చగా
మైనా గోరింక... మంత్రము చదివెను

చిలకమ్మ మగడంత... చిరునవ్వులు నవ్వుతూ
చిలకమ్మ మెడకట్టె... చింతాకు పుస్తె...!!

వెబ్దునియా పై చదవండి