అనువుగాని చోట నధికుల మనరాదు కొంచెముండుటెల్ల కొదువకాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ.. వినుర వేమ...!
తాత్పర్యం : ఎంతటి వివేకవంతుడైనా, బలవంతుడైనా యుక్తిపరుడు కాకపోయినట్లయితే భంగపడే అవకాశాలున్నాయి. తగిన సమయం, స్థానం కానప్పుడు అణిగిమణిగి ఉండటం అవమానమేమీ కాదు. పులి వెనుకడుగు వేయడం, అదును చూసి పంజా విసరడానికేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
నమ్రత ప్రదర్శించటం అంటే... తగిన శక్తిని కూడగట్టుకోవడమే. అద్దంలో కొండ చిన్నదిగా కనిపించినంత మాత్రాన, దాని అసలు పరిమాణంలో లోపం కలుగుతుందా..? శక్తి సామర్థ్యాలతోపాటు యుక్తి, సహనం అన్న లక్షణాలు విజయసాధనకు తోడ్పడుతాయని ఈ పద్యం యొక్క భావం.