ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన పసుపు రైతులు కూడా నరేంద్ర మోడీపై పోటీ చేయనున్నారు. ఈ మేరకు వారు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. వీరంతా వారణాసిలో నామినేషన్లు వేసేందుకు వెళ్లారు. వీరిని స్థానిక బీజేపీ నేతలు, ఇంటెలిజెన్స్ పోలీసులు ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేసినా.. స్థానిక రైతుల నుంచి అనూహ్యంగా మద్దతు లభించింది.
నామినేషన్లు వేసేందుకు శనివారం రోజు వారణాసికి చేరుకున్న రైతులను ఇబ్బంది పెట్టేందుకు స్థానిక బీజేపీ నేతలు ప్రయత్నించారు. నామినిగా ఉండేందుకు స్థానికులు ఎవ్వరూ ముందుకురాలేదు. అయితే, నామినేషన్లు వేసేందుకు సిద్ధమైన పసుపు రైతులకు స్థానిక రైతు సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
స్థానిక బీజేపీ నేతలు, ఇంటెలిజెన్స్ అధికారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పట్టువదలని పసుపు రైతులు నామినేషన్ వేయనున్నారు. సోమవారం 45 మంది పసుపు రైతులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మరోవైపు ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన 8 మంది రైతులు కూడా నామినేషన్లు వేస్తారు. ఇక తమిళనాడులోని ఈరోడు ప్రాంతానికి చెందిన మరో 15 మంది రైతులు కూడా నామినేషన్ పత్రాలు సిద్ధం చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ రెండో సారి బరిలోకి దిగిన వారణాసి లోక్‌సభ స్థానానికి ఇప్పటికే స్థానికంగా 60కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. మోడీపై పోటీచేసేందుకు స్థానికులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక తెలంగాణ, తమిళనాడు, ఏపీ రైతులు కూడా నామినేషన్ల వేస్తే.. నామినేషన్ల సంఖ్య 100 దాటిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా వారణాసి లోక్‌సభ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది.