రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. గత ఎనిమిది నెలల్లో మొత్తం 19 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు రెండు, మూడు వారాలకు ఒరకు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నారు. ఈ క్రమంలో మెడికల్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతోన్న మరో విద్యార్థి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనో జ్యోత్‌గా గుర్తించారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 19 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్ రామ్‌పూర్‌కు చెందిన మనోజ్యోత్ ఛబ్రా.. మెడికల్ ఎంట్రాన్స్ ఎగ్జామ్ శిక్షణ కోసం ఈ ఏడాది జనవరిలో కోటాకు వచ్చాడు. నీట్ కోచింగ్ తీసుకుంటున్న అతడు.. గురువారం ఉదయం తన హాస్టల్ గదిలో విగతజీవిగా కనిపించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
గతేడాది 15 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడగా.. ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్య 19కు చేరడం గమనార్హం. అంతకుముందు కూడా పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. వీటితోపాటు అనేక ఘటనల్లో విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, ఒత్తిడితోనే ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.