జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీన్ని జీర్ణించుకోలేని పాకిస్థాన్... భారత్‌లో విధ్వంసానికి ఉగ్రమూకలను ప్రేరేపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 273 మంది కాశ్మీర్ లోయలోకి చొరబడినట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో కాశ్మీర్ లోయతో పాటు.. జమ్మూ, లద్ధాక్ తదితర ప్రాంతాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు.
దాడులకు పాల్పడటం ద్వారా, అలజడులు సృష్టించేందుకు ఈ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు యత్నిస్తున్నారని హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కాశ్మీరులో 96, దక్షిణ కాశ్మీరులో 158, సెంట్రల్ కాశ్మీరులో 19 మంది ముష్కరులు ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. ఈ నేపథ్యంలో, భారత భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. ముష్కరుల కోసం వేటను ప్రారంభించాయి.