అస్సోంలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఐదుగురు యువకుల కాల్చివేత

శుక్రవారం, 2 నవంబరు 2018 (09:20 IST)
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సోంలో వేర్పాటు సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. ఖబారీ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులను అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఒకరి తర్వాత మరొకరిపై తుపాకులతో కాల్పులకు పాల్పడి హతమార్చారు. ఆ తర్వాత వారి శవాలను బ్రహ్మపుత్ర నదీ తీరంలో పడేసి వెళ్లిపోయారు. 
 
కాగా గురువారం రాత్రి సదియా పట్టణంలో ఓ షాపు ముందు కూర్చున్న ఈ ఐదుగురు యువకులను బ్రహ్మపుత్ర నదీ తీరంలోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. వారికోసం కుటుంబసభ్యులు గాలిస్తుండగా వారి మృతదేహాలు నదీ తీరంవద్ద ఉండటంతో తీవ్రంగా విలపించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టింది యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఉగ్రవాదులేనని గుర్తించారు. ఇక ఈ ఘటనపై కేంద్ర హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు