మరాఠా నటికి చుక్కలు చూపిన ఉబెర్ కారు డ్రైవర్.. కమిషనర్‌కు ఫిర్యాదు

సోమవారం, 17 అక్టోబరు 2022 (10:43 IST)
మరాఠా నటి, దర్శకురాలు మానవ నాయక్‌కు ఉబెర్ కారు డ్రైవర్ ఒకరు చుక్కలు చూపించాడు. దీంతో భయపడిపోయిన ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో ఇద్దరు బైకర్లు, ఓ ఆటోవాలాలు ఆమన రక్షించారు. ఆ తర్వాత ఆమె తన ఫేస్‌బుక్‌లో సుధీర్ఘ పోస్ట్ పెట్టగా దీనిపై ముంబై పోలీస్ కమిషనర్ స్పందించారు. నిందితుడిని సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. 
 
ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో చేసిన సుధీర్ఘ పోస్ట్ కథనం మేరకు.. శనివారం రాత్రి 8.15 గంటల సమయంలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) నుంచి తన ఇంటికి వెళ్లేందుకు నటి ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. ఆమె కారు ఎక్కిన తర్వాత డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడాన్ని గమనించిన ఆమె డ్రైవర్‌ను మందలించారు. సరికదా.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ, సిగ్నల్స్‌ను జంప్ చేస్తూ వెళ్లాడు. ఈ క్రమంలో ఓ ప్రదేశంలో ట్రాఫిక్ పోలీసులు ఆపి ఫొటోలు తీసుకున్నారు. దీంతో పోలీసులతో డ్రైవర్ వాగ్వివాదానికి దిగడంతో నటి మానవ నాయక్ కల్పించుకుని.. ఫొటోలు తీసుకున్నారు కాబట్టి తమను వదిలేయాలని పోలీసులను కోరారు. 
 
దీంతో నటిపై మండిపడిన డ్రైవర్ 'రూ. 500 ఫైన్ నువ్వు చెల్లిస్తావా?' అంటూ ఆమెతో గొడవకు దిగాడు. చెల్లించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. దీంతో భయపడిపోయిన ఆమె కారును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని కోరినా వినిపించుకోలేదు. పైగా ఎవరికో ఫోన్ చేస్తూ కారను చీకటి ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి డ్రైవర్ వేగం పెంచి చునాబట్టి రోడ్డు, ప్రియదర్శిని పార్క్ మీదుగా దూసుకెళ్లాడు. 
 
ఇలాగైతే లాభం లేదనుకున్న నటి ఉబెర్ సేఫ్టీ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేశారు. ఆమె మాట్లాడుతుండగానే డ్రైవర్ మరోమారు కారు వేగం పెంచి దూసుకెళ్లాడు. దీంతో భయపడిన మానవ నాయక్ కారు ఆపాలని కోరారు. అతడు ఆపకుండా వేరే ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుండడంతో భయపడిన ఆమె రక్షించమని కేకలు వేయడం మొదలుపెట్టారు. 
 
దీన్ని గమనించిన ఇద్దరు బైకర్లు, ఓ ఆటోవాలా కారును అడ్డుకుని నటిని రక్షించారు. వారి సాయంతో తాను బయటపడ్డానని, కానీ చాలా భయపడిపోయానంటూ ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్టు చేశారు. కారు నంబరుతోపాటు డ్రైవర్ ఫొటోను కూడా షేర్ చేశారు. దీనికి స్పందించిన పోలీస్ జాయింట్ కమిషనర్.. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని హామీ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు